కేసీఆర్ కు ముందున్నది ముసళ్ల పండగేనా?

0

టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నిజంగానే ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయినట్టుగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె… దానికి మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్ డౌన్ యోచన… వెరసి కేసీఆర్ కు డబుల్ ట్రబుల్ తప్పేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు కేసీఆర్ కాస్తంత కఠినంగానే వ్యవహరిస్తున్న దాఖలాలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ఘీంకరింపులకు ఆర్టీసీ కార్మికులు ఎంతమాత్రం బెదరడం లేదు. ఎస్మా ప్రయోగించినా సమ్మె విరమించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలో పండగలోగా సమ్మె ముగిసిపోతే ఫరవాలేదు గానీ.. పండగ తర్వాత కూడా సమ్మె కొనసాగితే… ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కనీసం పెన్ డౌన్ అయినా చేయాల్సిందేనన్న భావనకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వచ్చినట్లుగా వినిపిస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సమాలోచనలు మొదలెట్టేశాయి. ఇప్పటికే ఈ దిశగా కీలక భేటీలు జరగగా… పండగ ముగిసిన వెంటనే ఈ సంఘాలన్నీ మరోమారు భేటీ కానున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తాము చేసిన సకల జనుల సమ్మెకు ఆర్టీసీ కార్మికులు వెన్నుదన్నుగా నిలిచిన వైనాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. తమకు సాయం చేసిన ఆర్టీసీ కార్మికులకు ప్రతిఫలంగా తాము కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలకాల్సిందేనన్న కోణంలో యోచిస్తు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. ఈ దిశగా నేరుగా సమ్మెకు దిగకున్నా.. కనీసం పెన్ డౌన్ తరహా నిరసనలు చేపట్టాలని ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

పండగలోగా సమ్మె కాల్ ఆఫ్ అయితే ఓకే గానీ.. పండగ తర్వాత కూడా సమ్మె కొనసాగితే మాత్రం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పెన్ డౌన్ చేయాల్సిందేనని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన మెజారిటీ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే.. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెను విరమింపజేసేందుకు తనదైన యత్నాలు చేస్తున్న కేసీఆర్…. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా రంగంలోకి దిగితే తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు రంగంలోకి దిగితే… నిజంగానే కేసీఆర్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మొత్తంగా పండగ తర్వాత కూడా ఆర్టీసీ సమ్మె కొనసాగితే… కేసీఆర్ కు దసరా తర్వాత ముసళ్ల పండగ స్వాగతం చెప్పినట్టేనని విశ్లేషణలు మొదలైపోయాయి. .
Please Read Disclaimer