పిల్లాడు కాదు పిశాచి.. ఎనిమిదేళ్ల వయస్సులోనే హత్యలు, చెల్లినీ వదల్లేదు!

0

ఆ ఊరిలో ఇద్దరు పసిబిడ్డను ఎవరో దారుణంగా హత్య చేశారు. దీంతో గ్రామస్తులంతా భయాందోళనలకు గురయ్యారు. ఆ హత్యలు ఎవరు చేశారో తెలియక బిక్కుబిక్కుమని గడిపారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మరో దారుణం చోటుచేసుకుంది. ఈ సారి ఆరు నెలల పసిబిడ్డ కనిపించకుండా పోయింది. దీంతో గ్రామస్తులు మరింత కలవరపడ్డారు.

కనిపించకుండా పోయిన ఆ పసిబిడ్డ కోసం వీధి వీధినా వెతకసాగారు. అప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆరు బయట ఆడుకుంటున్న పిల్లలను ‘‘పసిబిడ్డను ఎక్కడైనా చూశారా?’’ అని అడిగారు. ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల బాలుడు ముందుకొచ్చి.. ‘‘నేను చూశా’’ అన్నాడు. దీంతో గ్రామస్తులు ‘‘ఎక్కడ చూశావో చెప్పు’’ అని అడిగారు. తానే ఆమెను తీసుకెళ్లానని అతడు చెప్పాడు. దీంతో గ్రామస్తులు.. ‘‘ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేశావు అని అడిగారు. ‘‘నేనే ఆమె తలను ఇటుకతో బద్దలకొట్టి మట్టిలో కప్పెట్టా’’ అని చెప్పాడు.

ఆ బాలుడి మాటలు వినగానే.. ఆ బిడ్డ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు గుండె జారినంత పనైంది. ఆ బాలుడి మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో బిడ్డను కప్పెట్టిన ప్రాంతాన్ని చూపించాలని అడిగారు. దీంతో అతడు ఆ ప్రాంతానికి తీసుకెళ్లి చూపించాడు. అతడు నిజంగానే ఆ బిడ్డను చంపేశాడు. అత్యంత క్రూరంగా తలను చిదిమేసి దారుణానికి పాల్పడ్డాడు.

పిల్లలను కిరాతకంగా చంపిన ఆ బాలుడి పేరు అమర్ దీప్ సదా. స్వస్థలం.. బీహార్‌లోని బెగుసరాయి గ్రామం. అతడికి ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు 2007లో హత్యాకాండకు తెరలేపాడు. అమర్ దీప్.. ఏడాది కూడా నిండని తన పిన తండ్రి కొడుకుతో హత్యకాండకు తెర లేపాడు. ఆ తర్వాత ఎనిమిది నెలల వయస్సు గల తన సొంత చెల్లినే చంపాడు. ఆ హత్యలు చేసింది అమర్ దీప్ అని తెలిసి కుటుంబికులు ఆశ్చర్యపోయారు. అయితే, ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఫలితంగా మూడో బిడ్డ ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.

ఓ రోజు స్కూల్ వరండాలో నిద్రపోతున్న ఆరు నెలల పసిబిడ్డను అమర్‌దీప్ ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత ఇటుకను తలపై మోది చంపేశాడు. అక్కడే గొయ్యి తిసి పాతిపట్టి ఇంటికి వెళ్లిపోయాడు. పోలీసులు విచారణలో ఆ మూడు హత్యలు తానే చేశానని తెలిపాడు. అంతేకాదు.. తాను ఆ హత్యలు ఎలా చేశాడనేది కథలా వివరించాడు. అయితే, ఎందుకు వారిని చంపావనే ప్రశ్నకు మాత్రం అతడి నుంచి సమాధానం రాలేదు. పైగా, బిస్కెట్లు ఉంటే పెడతారా? అని పోలీసులను అడిగాడు. పైగా, తాను చేసిన హత్యల వివరాలన్నీ చెప్పినందుకు బోలెడు చాక్లెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పసిబిడ్డలైతే తనకు ఎదురు చెప్పరనే ధైర్యంతోనే హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావించారు.

ఈ పిల్లాడి మానసిక స్థితిపై సైకాలజిస్ట్ శంషాద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘‘అతడిలో ఓ రకమైన శాడిజం ఉంది. ఎవరైనా బాధతో విలవిల్లాడుతుంటే చూసి ఆనందించడం లక్షణాలు వీరిలో ఉంటాయి. అందుకే ఆ బాలుడు కూడా ఈ హత్యలకు పాల్పడి ఉండవచ్చు’’ అని తెలిపారు. అమర్‌దీప్‌ను పరీక్షించిన వైద్యులు.. అతడు ‘కండక్ట్ డిజార్డర్’తో బాధపడుతున్నాడని తెలిపారు. ఇది శరీరంలో జరిగే ఓ రసాయన ప్రక్రియ అని, దీన్ని కేవలం ధ్యానంతోనే నయం చేయగలరన్నారు.

స్వేచ్ఛగా తిరుగుతున్నాడు: చిన్న వయస్సులో నేరాలకు పాల్పడేవారిపై అమెరికా వంటి దేశాల్లో కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి. బాల నేరుగాళ్లను అక్కడ పెద్దల్లాగానే భావిస్తారు. అయితే, ఇండియాలో మాత్రం సాధారణ జైలు శిక్షలు మాత్రమే విధిస్తున్నారు. దీంతో అమర్ దీప్ కేవలం మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించారు. ఈ మూడేళ్లు అతడికి మానసిక చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా అతడు జైల్లోనే గడిపినట్లు సమాచారం.

2015లో మీడియా ముందుకు వచ్చిన అమర్‌దీప్.. తనకు 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు యూత్ హోమ్‌లో ఉన్నానని చెప్పాడు. ప్రస్తుతం అతడు తన పేరు మార్చుకుని సాధారణ జీవితం గడుపుతున్నట్లు తెలిసింది. అయితే, అతడి గురించి చాలా విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆ ముగ్గురిని ఎందుకు చంపాడనే కారణాలు కూడా రహస్యంగానే మిగిలిపోయాయి. అమర్‌దీప్.. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులోనే హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ అని పలు వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. అమర్‌దీప్ కథ వింటుంటే.. మీకు మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమా గుర్తుకొస్తుంది కదూ. అందులో కూడా ప్రతినాయకులు సూర్య, భరత్‌లు చనిపోయినవారి బంధువుల ఏడుపులు వినేందుకు హత్యలు చేస్తారు.
Please Read Disclaimer