బీజేపీకి మరో షాక్… ఆసుపత్రిలో చేరిన జ్యోషి

0

కేంద్రంలో వరుసగా రెండో దఫా కూడా అధికార పగ్గాలు చేపట్టిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీలో కీలక నేతలుగా ఎదిగిన ఇద్దరు నేతలు సుష్మా స్వరాజ్ – అరుణ్ జైట్లీ ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా కేవలం వారం వ్యవధిలోనే మృతి చెందారు. ఓ పది రోజుల క్రితం సుష్మా కన్నుమూస్తే… నిన్న జైట్లీ తుది శ్వాస విడిచారు. ఆదివారం జైట్లీ అంత్యక్రియలు ముగిశాయో – లేదో… ఆ పార్టీకి చెందిన శ్రేణులకు మరో షాకింగ్ వార్త వినిపించింది. పార్టీలో కీలక నేతగానే కాకుండా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్న సీనియర్ నేత – కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జ్యోషి ఇప్పుడు ఆసుపత్రిలో చేరిపోయారు. అనారోగ్యం కారణంగా ఆయన ఇప్పుడు కాన్పూర్ లోని రీజెన్సీ ఆసుపత్రిలో చేరారన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి.

సుష్మా – జైట్లీ మాదిరే గడచిన ఎన్నికల్లో జ్యోషి కూడా ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ సమకాలీకుడిగా ప్రచారంలో ఉన్న జ్యోషి… పార్టీ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. పార్టీ అధికారానికి దూరంగా ఉన్న సమయంలో పార్టీ పురోభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారు. అలాంటి నేత అద్వానీ మాదిరే 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత తెరమరుగు అవుతూ కనిపించారు. అద్వానీ మాదిరే జ్యోషికి కూడా మోదీ కేబినెట్ లో గానీ – ఇతరత్రా పార్టీ వ్యవహారాలకు సంబంధించి గానీ కీలక పదవులేమీ దక్కలేదు. గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన జ్యోషి… పార్టీ సైద్ధాంతిక బాధ్యులల్లో ముఖ్యుడిగా ముద్ర వేసుకున్నారు.

ఓ వైపు ఢిల్లీలో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిసిన కాసేపటికే జ్యోషి అస్వస్థతకు గురయ్యారని – ఆయనను ఆసుపత్రికి తరలించారని వచ్చిన వార్తలు నిజంగానే బీజేపీలో కలకలమే రేపాయని చెప్పక తప్పదు. వయో భారం కారణంగానే ఎన్నికలకు దూరంగా ఉన్న జ్యోషి… ఢిల్లీని వదిలి తన సొంతూరు కాన్పూర్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి జ్యోషి అనారోగ్యానికి గురి కాగా… కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటీన నగరంలోని రీజెన్సీ ఆసుపత్రికి తరలించారు. జ్యోషికి వెనువెంటనే చికిత్స మొదలుపెట్టిన రీజెన్సీ వైద్యులు… ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించారు.
Please Read Disclaimer