కేసీఆర్ తాజా వీడియో క్లిప్ ను మోడీషాలకు పంపారట!

0

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మదగిన వ్యక్తి కాదు. ఆయన మాటలు అవసరానికి తగ్గట్లు ఉంటాయి. ఆయన్ను నమ్ముకోవటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. కేసీఆర్ తో దోస్తానా పార్టీ ఉనికికి ప్రమాదం.. కేసీఆర్ ను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మీద దృష్టి సారించాల్సిందే.. ఇలాంటి ఎన్నో రిక్వెస్టులు తెలంగాణ బీజేపీ నేతలు తమ అగ్రనాయకత్వానికి తరచూ పంపిస్తుంటారు.

తమ ఢిల్లీ పెద్దలతో కేసీఆర్ కున్న అనుబంధం మీద అసెంబ్లీ ఎన్నికల వేళలోనూ.. ఆ తర్వాత అస్పష్టత ఉండేది. కేసీఆర్ తమకు మిత్రుడా? శత్రువా? అన్న విషయంలో తెలంగాణ బీజేపీ నేతలకు ఒక పట్టాన అర్థమయ్యేది కాదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో మాత్రం వారికి పూర్తి క్లారిటీ వచ్చింది. అదే.. నాలుగు సీట్లను సొంతం చేసుకోవటానికి కారణమని చెప్పేవారు బీజేపీలో చాలామంది కనిపిస్తారు.

ఢిల్లీతో స్నేహం ఒకపక్క.. తెలంగాణలో వైరం మరో పక్క అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించే వారని తెలంగాణ బీజేపీ నేతలు వాపోయేవారు. తమ అధినాయకత్వం తమ మాట వినేది కాదని ఆక్రోశం వెళ్లగక్కేవారు. ఇన్నాళ్లకు కేసీఆర్ మీద తమ అధినాయకులకు క్లారిటీ వచ్చేసిందని.. ఇప్పుడు తమ మాటలకు విలువ ఇస్తున్నట్లుగా వారు చెబుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఇటీవల కాలంలో బీజేపీ అధినాయకత్వానికి చేరిన ఫిర్యాదు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న పార్టీ ముఖ్యులు తెలంగాణ అధికారపక్షంతో వ్యవహరించాల్సిన విషయం మీద ఒక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న మాట వినిపిస్తోంది. తాను అదే పనిగా కోరినా అపాయింట్ మెంట్ ఇవ్వని మోడీపై తనకున్న గుర్రును తాజా ప్రెస్ మీట్ లో బయటకు పదర్శించారు.

మోడీని తాను పలు సందర్భాల్లో విమర్శలు చేశానని.. తన మాదిరి మరెవరూ అనలేదన్న విషయాన్ని చెప్పిన కేసీఆర్.. ఎప్పుడెప్పుడు ఏమేం మాట్లాడన్న విషయాల్ని వివరంగా చెప్పేశారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు బీజేపీ నేతలకు అస్త్రాలుగా మారాయి.

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మోడీని తానెప్పుడు ఏ ఏ మాటలు అన్న విషయాల వీడియో క్లిప్ ను బీజేపీ అధినాయత్వానికి తెలంగాణ రాష్ట్ర నేతలు పంపినట్లుగా తెలుస్తోంది. ఈ క్లిప్ ఒక్కటి చాలని మోడీని ఉద్దేశించి గతంలో కేసీఆర్ ఎంత దారుణ వ్యాఖ్యలు చేశారో అర్థమవుతుందన్న మాట బీజేపీ ముఖ్యనేతల మాటల్లో వినిపిస్తోంది. మరి.. ఈ క్లిప్ పై బీజేపీ అధినాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.