ఉల్టా వేలాడదీసి.. కోసేస్తాం.. అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

0

బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం నేతలు అసదుద్దీన్‌ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని భారీ క్రేన్‌కు తలకిందులుగా వేలాడదీస్తానని అన్నారు. అసద్‌ గడ్డం కోసి ముఖ్యమంత్రికి అతికిస్తానంటూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ముల్లా రూపంలో ఉన్న సీఎం అంటూ విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూరా తిరగడానికే పరిమితమైన అక్బరుద్దీన్ బీజేపీని ఏదో చేస్తాడంట అంటూ ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా తెలంగాణ బీజేపీ నిజామాబాద్‌ పట్టణంలో శుక్రవారం (జనవరి 3) ‘ఇందూర్ ప్రజా ప్రదర్శన’ పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, వివేక్‌తో పాటు పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మజ్లిస్ పార్టీకి తొత్తుగా టీఆర్‌ఎస్ వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. నిజామాబాద్ మేయర్ పదవిని ఎంఐఎంకు అప్పగించడానికి టీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఈ క్రమంలో మజ్లిస్ నేతలను ఏకవచన సంబోధనలో పరుష పదజాలంతో దూషించారు.

‘బీజేపీ ఎక్కడుంది, ఎక్కడుంది అని పదే పదే అంటున్నారు. ప్రజల గుండెల్లో ఉంది బీజేపీ. నీ బిడ్డే (కల్వకుంట్ల కవిత) బీజేపీ దెబ్బకు బలైంది. గడ్డంలేని ముల్లా మన సీఎం.. ఆయన బేటా నాస్తిక్. వీళ్లు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. మొన్న ఆయన పెద్ద కొడుకు (అసదుద్దీన్‌ను ఉద్దేశించి) ఇక్కడికొచ్చిండు. ఇంత పెద్ద గడ్డమేసుకొని. భారతీయ పార్టీని, ఆరెస్సెన్‌ను చింపేస్తాడట. హైదరాబాద్‌లో నీ ఇలాకలనే మొహమ్మద్ ఫైల్వాన్ అనే నీవోడే నీ తమ్ముడిని 50 సార్లు పొడిచిండు. నువ్వు ఏం చేయలేకపోయావ్. ఇక్కడేం చేస్తావ్’ అని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు.

‘ఆ చిరిగిన దాన్ని అంటిబెట్టుకోవడానికి వాడు 9 ఏళ్ల నుంచి తిరుగుతుండు. ఇప్పటికీ ఏడాదిలో ఆర్నెళ్లు ఆస్పత్రుల చుట్టే తిరుగుతడు. చిరిగిన తన శరీరాన్ని అంటిబెట్టుకోడానికి. సొంత తమ్ముడిని కాపాడులేకపోయిన అతడు బీజేపీని చింపుతడట. నువ్వు మొన్న సభ పెట్టుకున్న దారుస్సలాంలోనే నిన్ను ఉల్టా వేలాడదీసి గడ్డం కోస్తాం. గడ్డం కోసి దాన్ని పడెయ్యం. దానికి ప్రమోషన్ ఇస్తాం. ముఖ్యమంత్రికి అంటిపెడతాం. గడ్డంలేని ముల్లా కదా మన ముఖ్యమంత్రి. అప్పుడు గడ్డం ఉన్న ముల్లా అని జనానికి అర్థమైతది’ అంటూ ఎంపీ అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘పాతబస్తీలో చాలా ప్రాంతాలు బిషప్‌‌ఖానాల లెక్క కంపు కొడతయి. అక్కడనే మంచిగా చేసుకోలేకపోతివి. నీ తమ్ముడినే కాపాడుకోలేకపోతివి. నీకు ఇడేంపని.. బీజేపీని ఏం చేయగలవు. నీ మొఖాన్ని అద్దంలో చూసుకున్నావా’ అని అసదుద్దీన్‌ను ఉద్దేశించి అరవింద్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ ప్రభావమే లేదంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. దేశంలో తమ పార్టీ 300లకు పైచిలుకు లోక్‌సభ స్థానాలను గెలుచుకుందని ఆయన గుర్తుచేశారు.
Please Read Disclaimer