రచ్చగా మారిన టీ యాడ్..అందులో ఏముంది?

0

రోజులు మారిపోయాయి. సహనం అంతకంతకూ తగ్గిపోతోంది. విషయాల్ని భూతద్దాల్లో చూస్తున్న పరిస్థితి. నోట్లో నుంచి వచ్చే చిన్న మాటను పట్టి.. పట్టి చూస్తున్న పరిస్థితి. సంప్రదాయ మాథ్యమాలకు సోషల్ మీడియా తోడు కావటం.. హస్తభూషణంగా మారిన సెల్ ఫోన్ పుణ్యమా అని.. విషయం ఏదైనా సరే..కాస్త తేడా కొట్టినా వివాదంగా మారిపోతోంది. ఇప్పుడు అలాంటి వివాదం ఒక టీ పొడి యాడ్ పుణ్యమా అని రాజుకుంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ యాడ్ ఒక ప్రముఖ బ్రాండ్ కు సంబంధించింది. మల్టీనేషనల్ కంపెనీకి చెందిన ఈ వాణిజ్య ప్రకటన ఏడాది క్రితం తయారు చేసింది. కానీ.. ఇప్పుడిది వివాదంగా మారి.. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ యాడ్ లో ఉన్న కంటెంట్ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందన్న మాటను పలువురు వినిపిస్తున్నారు.

దీనికి తగ్గట్లే పలువురు నెటిజన్లు ఇదే విషయాన్ని బాహాటంగా చెప్పేయటంతో ఈ టీ పొడి ప్రకటన ఇప్పుడు కాంట్రావర్సీగా మారింది. సదరు టీ పొడిని బహిష్కరించాలంటూ హిందూ నెటిజన్లు ఉద్యమానికి తెర తీయటం గమనార్హం. ఇంతకీ ఈ వివాదం ఎందుకు రాజుకుంది? సదరు యాడ్ లో ఉన్న కంటెంట్ ఏమిటి? ఏ అంశం ఇంత హడావుడికి కారణమైంది? అన్న విషయాల్లోకి వెళితే..

ఈ యాడ్ లో ఒక పెద్దాయన వినాయకుడి విగ్రహాల్ని తయారు చేస్తుంటారు. అంతలో ఒక వ్యక్తి వచ్చి తాను విగ్రహాన్ని కొనాలనుకుంటున్నట్లు చెప్పటంతో.. అతడికి పలు రకాలైన విగ్రహాల్ని చూపిస్తాడు. అంతలో పెద్దాయనకు నమాజ్ టైం కావటంతో.. టోపీని ధరిస్తాడు. షాక్ కు గురైన కస్టమర్..తాను రేపొచ్చి విగ్రహాన్ని కొనుగోలు చేస్తానని చెబుతాడు. దీంతో ఆ పెద్దాయన బాధగా ముఖాన్ని పెడతాడు. సరే.. కనీసం టీ అయినా తాగి వెళ్లండని చెబుతాడు. టీ తాగే సమయంలో నమాజ్ చేసే చేతులే విగ్రహాన్ని తయారు చేసినట్లు చెప్పి.. ఇది కూడా దేవుడ్ని కొలవటమేనని చెబుతాడు. ఆ వ్యక్తికి జ్ఞానోదయం అవుతుంది. రేపు వచ్చి విగ్రహాన్ని తీసుకెళ్తావా? ఇప్పుడే తీసుకెళ్తావా? అనటంతో యాడ్ ముగుస్తుంది.

ఈ యాడ్ చివర్లో.. ఇదో వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించిన ప్రకటనగా పేర్కొన్నారు. ఈ యాడ్ ను మామూలుగా చూస్తే.. ఇందులో అంత వివాదాస్పదమైన కంటెంట్ ఏమీ లేదుగా అనిపిస్తుంది. కానీ.. కాస్త లోతుగా చూసినప్పుడు.. హిందువులంటే ముస్లింల పట్ల వివక్ష చూపిస్తారని.. అందుకు భిన్నంగా ముస్లింలు హిందువులతో కలిసిపోవటానికి సిద్ధంగా ఉన్నరన్న సంకేతాలు ఇచ్చేలా ఈ ప్రకటన ఉన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారి.. ఈ టీ పొడి ప్రకటన హిందువుల్ని కించపరిచేలా ఉందన్న వాదన అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. సోషల్ మీడియాలో ఇప్పుడు బాయ్ కాట్ రెడ్ లేబుల్ టీ అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. మరీ.. టీ ప్రకటనను రూపొందించిన యూనీ లివర్స్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.