మీ కేబుల్ టీవీ బిల్లు తగ్గుతుంది

0

టీవీ వీక్షణం ఇప్పుడు నిజంగానే ఖర్చుతో కూడుకున్నదైపోయింది. ఇదివరకులా ఏ రూ.100కో రూ.150కో అన్ని ఛానెళ్లను వీక్షించే సౌలభ్యం వినియోగదారులకు లభించడం లేదు. సౌత్ ప్యాక్ నార్త్ ప్యాక్ స్పోర్ట్స్ ప్యాక్ మూవీ ప్యాక్… ఇలా ఏ ప్యాక్ తీసుకున్నా కూడా జేబుకు చిల్లు పడిపోతోంది. ఏ ప్యాక్ తీసుకున్నా కూడా నికరంగా మనకు కవాల్సిన ఛానెళ్లు అన్నింటినీ చూడాలంటే… అదనపు సొమ్ము చెల్లించక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు పండగ బొనాంజాలా ఓ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా కదులుతున్నట్లుగా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. రూ.130కే ఏకంగా 150 ఛానెళ్లను అందించేందుకు కేబుల్ ఆపరేటర్లు చేస్తున్న యత్నాలు ఫలిస్తే…. కేబుల్ ద్వారానే ప్రసారాలు అందుకుంటున్న వినియోగదారులకు నిజంగానే దసరా బొనాంజా అందినట్టేనని చెప్పక తప్పదు.

కేబుల్ వినియోగదారులను అమితంగా ఆకర్షించే ఈ విషయంపై ఇప్పటిదాకా పూర్తి వివరాలు రాకున్నా… కేబుల్ ఆపరేటర్ల సంఘం ఈ దిశగా తనవంతు యత్నాలను ముమ్మరం చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం కేబుల్ టీవీ ప్రొవైడర్లు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద రూ.130ను వసూల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్(ఏఐడిసిఎఫ్) ఇండియాలోని 80 శాతం కేబుల్ యూజర్లకు సేవలు అందిస్తున్న సంగతీ తెలిసిందే. ఈ ఫెడరేషన్ లో సభ్యత్వం కలిగి ఉన్న హాత్వే డిజిటల్ ఇన్డిజిటల్ సిటీ నెట్ వర్క్ జీటీపీఎల్ హాత్వే ఫాస్ట్వే ట్రాన్స్మిషన్ డీఈఎన్ నెట్ వర్క్ యూసీఎన్ కేబుల్ ఆర్టెల్ కమ్యూనికేషన్స్ ఐసీఎన్సీఎల్ ఏషియానెట్ డిజిటల్ కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యాయట. ఇందులో భాగంగా రూ.130కే 150 ఛానెళ్లను యూజర్లకు అందించాలనన్న విషయంపై చర్చించి… ఆ దిశగా ఓ నిర్ణయం తీసుకున్నారట. ఇక ఈ విషయాన్ని ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్ఎన్ శర్మ ప్రకటించేశారు కూడా.

అయితే ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ట్రాయ్ అనుమతి ఉందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ట్రాయ్ రూ.130కు 100 ఛానెల్స్ను ప్రొవైడ్ చేయాలని షరతులు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో అన్ని రకాల ఫ్రీ ఛానెల్స్తో పాటుగా పెయిడ్ ఛానళ్ళు కూడా ఉంటాయి. ఇక 150 ఛానెల్స్ కావాలంటే రూ.40 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ట్రాయ్ షరతుల ప్రకారం రూ.170 చెల్లించే వినియోగదారులకు 150 ఛానెళ్లను అందించాలి. అయితే ట్రాయ్ నిర్దేశించిన రూ.130కి 100 ఛానెళ్లకు బదులుగా ఏకంగా రూ.130కే 150 ఛానెళ్లను అందిస్తే వినియోగదారులను నుంచి మరింత మద్దతు లభిస్తుంది కదా అన్న దిశగా ఫెడరేషన్ యోచిస్తోందట. అంతేకాక ట్రాయ్ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత 25% యూజర్లు కేబుల్ నుంచి డీటీహెచ్ సర్వీసుల వైపు మారారు. ఈ దెబ్బ కేబుల్ ఆపరేట్లపై బాగానే ప్రభావం చూపింది. ఇప్పుడు 150 ఛానెళ్లను రూ.130కే అందించడం ద్వారా డీటీహెచ్ వైపు మళ్లిన వినియోగదారులను కేబుల్ ఆపరేటర్లు తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంటుందన్న దిశగా ఫెడరేషన్ అంచనా వేస్తోంది. ఏదిఏమైనా టీవీక్షణం ఖరీదైన వ్యవహారంగా మారిన ప్రస్తుత తరుణంలో రూ.130కే 150 ఛానెళ్లను లభించడమంటే… వినియోగదారులకు దసరా బొనాంజాగానే పరిగణించక తప్పదు.
Please Read Disclaimer