మళ్లీ బుసలు కొడుతున్న ‘కాల్’ నాగులు

0

కాల్ మనీ.. వడ్డీ వ్యాపారంతో చాలా మంది ఉసురు తీసిన ఆ మహ్మమారి జాడలు మళ్లీ బెజవాడలో దర్శనమిచ్చాయి. టీడీపీ హయాంలో పెనుసంచలనంగా మారిన ఈ రాకెట్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో బయటపడడం సంచలనంగా మారింది. ఒకరి చావుకు కారణమైన ఈ ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది.

విజయవాడలో మరోసారి కాల్ మనీ కలకలం రేపుతోంది. అధికవడ్డీకి అప్పులు ఇవ్వడమే కాదు.. తర్వాత ఆస్తులు కూడా రాయించుకునే ఓ వర్గం రెచ్చిపోతోంది. ఈ వడ్డీ వ్యాపారుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు లక్ష్మణ్ రావు అనే వ్యక్తి. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

విజయవాడ కేంద్రంగా అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న శారద శ్రీధర్ రామకృష్ణ అమీర్ ల వడ్డీ వేధింపుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు లక్ష్మణ్ రావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వ్యాపారం చేస్తున్న లక్ష్మణ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అతడిని కాపాడే క్రమంలో ఆయన కుమార్తెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

పెనమలూరు మండలం చిన్నలక్ష్మణ్ రావు ట్రాన్స్ కో వ్యాపారం చేస్తున్నాడు. విజయవాడలో శారదా అనే మహిళ నుంచి 2017లో రెండు లక్షలను రెండు రూపాయల వడ్డీపై తీసుకున్నాడు. ఆ తర్వాత అమీర్ అనే వ్యక్తి నుంచి 8 లక్షలు తీసుకున్నాడు. వడ్డీలు చెల్లిస్తున్నా అప్పు తీరకపోవడంతో తనకున్న చోడవరంలోని 5 సెంట్ల భూమిని అమ్మాలని డిసైడ్ అయ్యాడు. అయితే డబ్బులకు బదులుగా రెండు సెంట్ల భూమి ఇవ్వాలని అప్పు ఇచ్చిన శారద డిమాండ్ చేసింది. అప్పుకంటే ఎక్కువే భూమి విలువ కావడంతో లక్ష్మణ్ రావు దీనికి నిరాకరించారు. అయితే మొత్తం 5 సెంట్లను కొంటానని శారద ఒత్తిడి తెచ్చింది. అప్పును ఆపి మిగతా డబ్బులు ఇస్తానని భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. అయితే రిజిస్ట్రేషన్ తర్వాత మాట మార్చి మిగతా డబ్బులు బాధితుడైన లక్ష్మణ్ రావుకు ఇవ్వలేదు.

శారద చేసిన మోసం తో మిగతా వారి అప్పు చెల్లించలేక.. వారి ఒత్తిడికి తలొగ్గలేక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆత్మహత్య చేసుకున్న లక్ష్మణ్ రావు వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారు. అయితే దీన్ని కాల్ మనీగా చేయలా వద్దా అనే విషయంపై పోలీసులు ఆలోచిస్తున్నారు.