సచివాలయ పోస్టులు కొట్టిన 21మందిపై కేసు

0

సచివాలయ వార్డ్ వెల్ఫేర్ ఉద్యోగాల భర్తీలో అధికారులనే బురిడీ కొట్టించి ఉద్యోగాలు కొల్లగొట్టిన వారి బండారం బయటపడింది. రీవెరిఫికేషన్ లో ఈ విషయం వెలుగుచూడడంతో ఇప్పుడు అభ్యర్థుల మెడకు ఉచ్చు బిగుసుకుంది. ప్రభుత్వాన్నే మోసం చేసి సచివాలయ వార్డు వెల్ఫేర్ ఉద్యోగాలు కొల్లగొట్టిన 21మంది క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించడం సంచలనంగా మారింది. ధ్రువపత్రాల పరిశీలననియామక పత్రాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు మెమోలు జారీ అయ్యాయి.

అనంతపురం నగర పాలకసంస్థలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ సెక్రటరీ పోస్టులు కేటాయించారు. దీనికి అర్హతగా బీఏ ఆర్ట్స్ హ్యుమానిటీస్ పెట్టారు. కొందరు బీకాం బీఎస్సీ అర్హతతో పరీక్ష రాశారు. మెరిట్ ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అర్హత లేకున్నా ఉద్యోగాలు దక్కించుకున్నారు. బీఎస్సీ బీకాం సర్టిఫికెట్లతో వస్తే పరిశీలించి రిజెక్ట్ చేయాల్సిన అధికారులు వారిని అర్హులుగా ఎందుకు ఎంపిక చేశారన్నది అర్థంకాలేదు. సర్టిఫికెట్ల పరిశీలన సరిగా చేయకుండానే వీరికి పోస్టింగ్ లు ఇచ్చినట్టు అధికారుల విచారణలో తేలింది. అయితే అర్హత లేకున్నా 21 మంది ఇలా బీఎస్సీ బీకాం డిగ్రీతో ఉద్యోగాలు కొల్లగొట్టారు.

అయితే కొందరు బీఎస్సీ బీకాం అభ్యర్థులు దీనిపై నగర్ కమిషనర్ తోపాటు జేసీకి ఫిర్యాదు చేశారు. కొందరు బీఎస్సీ బీకాం వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని.. అదే అర్హత ఉన్న మాకు మాత్రం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొనడంతో ఈ తప్పిదం వెలుగుచూసింది.

దీంతో కలెక్టర్ ఆదేశాలతో రీవెరిఫికేషన్ చేయగా.. అర్హతలేని బీఎస్సీ బీకాం సర్టిఫికెట్లతో 21 మంది ఉద్యోగాలు పొందినట్టు తేలింది. ఈ తతంగంపై సీరియస్ అయిన కలెక్టర్ ఆ 21 మందిపై క్రిమినల్ కేసులకు ఆదేశించారు. వారి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు పూనుకున్నారు.