దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కేసులో వైఎస్ జగన్.. సీబీఐ సంచలన వ్యాఖ్యలు

0

దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిన భారీ ఆర్థిక కుంభకోణంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ వ్యాఖ్యానించింది. కోట్లాది రూపాయల తీవ్రమైన ఆర్థిక కుంభకోణాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని కోర్టును కోరింది. సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో సీబీఐ అధికారులు బుధవారం కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది వైఎస్ జగన్ కేసు విషయమై కీలక అంశాలు ప్రస్తావించారు.

కుంభకోణానికి పాల్పడి అక్రమంగా లబ్ధి

వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం జగన్ పిటిషన్లు విచారణకు అర్హం కాదని సీబీఐ తెలిపింది. తనపై తీవ్రమైన ఆరోపణలున్నాయని తెలిసినప్పటికీ వైఎస్ జగన్ బెయిల్ షరతును తిరస్కరిస్తున్నారని పేర్కొంది. ఏదో ఒక కారణంతో కోర్టుకు హాజరు కావాలన్న చట్టబద్ధమైన విధుల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారని చెప్పింది. వైఎస్ జగన్, ఆ కేసులో నిందితులుగా ఉన్న వ్యాపారులు కార్పొరేట్ కుంభకోణానికి పాల్పడి అక్రమంగా లబ్ధి పొందారని తెలిపింది.

క్విడ్ ప్రోకో వల్ల లబ్ధి పొందింది జగనే..

తన కంపెనీల ప్రతినిధులుగా కోర్టుకు హాజరయ్యేందుకు కింది స్థాయి ఉద్యోగులను నియమించారని సీబీఐ ఆరోపించింది. తన కంపెనీల క్విడ్ ప్రోకో లావాదేవీల వల్ల లబ్ధి పొందింది వైఎస్ జగనేనని స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 205ను ఉపయోగించి కోర్టుకు హాజరు కాకూడదని చూస్తున్నారని సీబీఐ పేర్కొంది. ఒకవేళ హాజరు నుంచి మినహాయింపునిస్తే తాను కావల్సింది చేసే స్వేచ్ఛ వైఎస్ జగన్‌కు లభిస్తుందని సీబీఐ అభిప్రాయపడింది. రాజకీయ, ధన, కండ బలాన్ని ఉపయోగించి జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. ఈ కేసులో విచారణ ప్రక్రియ కనుచూపుకు అందనంత దూరం వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

జాప్యానికి జగనే కారణం

మొదటి చార్జి షీట్ దాఖలై ఎనిమిదేళ్లయినా ఇప్పటి విచారణ ప్రారంభం కాలేదని సీబీఐ వెల్లడించింది. వైఎస్ జగన్, ఇతర నిందితులు ఏదో ఒక నెపంతో విచారణ ప్రక్రియను జాప్యం చేస్తుండటమే ఇందుకు కారణమని ఆరోపించింది. రకరకాల కారణాలతో వివిధ కోర్టుల్లో వైఎస్ జగన్, ఇతర నిందితులు పిటిషన్లు వేస్తూ ఉన్నారని పేర్కొంది. విచారణ జాప్యం కావడానికి కారణం వైఎస్ జగన్, ఇతర నిందితులే కారణమని స్పష్టం చేసింది. జాప్యం జరుగుతోందంటూ ఓవైపు చెప్తూ మరోవైపు జగనే మినహాయింపు కోరుతున్నారని సీబీఐ పేర్కొంది.

రాజకీయాలతో కేసుకు సంబంధం లేదు

వైఎస్ జగన్ పిటిషన్‌లో ప్రస్తావించిన రాష్ట్ర విభజన, రాజకీయ ప్రస్థానంతో ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ స్పష్టం చేసింది. వరుస ఆర్థిక నేరాల్లో ప్రధాన నిందితుడైన వ్యక్తి తనకు తాను చట్టానికి అతీతుడిగా నిలబడొచ్చా.. అని సీబీఐ పేర్కొంది. హాజరు నుంచి మినహాయింపు పొంది.. బెయిల్ ఇచ్చిన కోర్టులోనే విచారణకు దూరం ఉండొచ్చా.. అని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

మొత్తం 16 చార్జి షీట్లలో నిందితుడు

ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్ ఒక్కసారే సీబీఐ కోర్టుకు వచ్చినట్లు సీబీఐ వెల్లడించింది. సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ హాజరు నుంచి మినహాయింపు తీసుకుంటూనే ఉన్నారని పేర్కొంది. సహేతుక కారణం లేకుండానే మినహాయింపు కోసం జగన్ మళ్లీ పిటిషన్ దాఖలు చేశారని చెప్పింది. వైఎస్ జగన్ అనేక చట్టాలు ఉల్లంఘించి సీబీఐ, ఈడీ కలిపి మొత్తం 16 చార్జి షీట్లలో నిందితుడిగా ఉన్నారని పేర్కొంది.

దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మచ్చ

సీఎంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని వైఎస్ జగన్ చెబుతున్న అంశాలు.. ఆయన దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మచ్చ తెచ్చే నేరానికి పాల్పడ్డారన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యల తీవ్రతను తగ్గించలేవని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. నిందితులుగా ఉన్న అధికారులు అనేక మంది వైఎస్ జగన్ పాలన పరిధిలో ఉన్నారని పేర్కొంది. జగన్ హోదా మారిందన్న కారణంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వరాదని విజ్ఞప్తి చేసింది.

నిందితుల హోదాతో సంబంధం లేదు

వారానికి ఒకసారి విజయవాడ నుంచి రావడం కష్టమని జగన్ పేర్కొనడం సమంజనం కాదని సీబీఐ అభిప్రాయపడింది. నేర విచారణ నిందితుల సమక్షంలో జరగాలని సీఆర్‌పీసీ చెబుతోంది గుర్తు చేసింది. చట్ట రూపకర్తలు కూడా చట్టానికి లోబడే ఉండాలని పేర్కొంది. వైఎస్ జగన్ తన సామాజిక, ఆర్థిక హోదా ఎలాంటి ప్రభావం చూపరాదని స్పష్టం చేసింది. తీవ్రమైన నేరాల్లో ప్రమేయమున్న నిందితుల హాదాతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

రాష్ట్ర వనరులు తాకట్టుపెట్టి..

రాష్ట్ర వనరులను తాకట్టు పెట్టి వైఎస్ జగన్ అక్రమంగా ధనవంతుడయ్యారన్న ఆరోపణలను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోరింది. ప్రజా ప్రయోజనాల కోసం పిటిషన్‌లో జగన్ ప్రస్తావించిన అన్ని అంశాలను తోసిపుచ్చాలని కోరింది. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం వ్యక్తిగత కష్టాలను భరిస్తానని జగనే అంటున్నారని పేర్కొంది. బెయిల్ సమయంలో జగన్ అంగీకరించిన షరతులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.

సీఎం అయినంత మాత్రాన కేసులు మారవు

వైఎస్ జగన్ రాజకీయ, వ్యక్తిగత కారణాలతో తరచూ హైదరాబాద్ వస్తున్నారని సీబీఐ పేర్కొంది. ముఖ్యమంత్రిగా ప్రజా పాలన జగన్ బాధ్యతే అయినా ఆ కారణంగా తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోర్టుకు శాశ్వతంగా హాజరు కాబోననడం సరికాదని అభిప్రాయపడింది. కేసు నమోదైనప్పటి నుంచి జగన్ రాజకీయాల్లోనే ఉన్నారని గుర్తు చేసింది. సీఎం అయినంత మాత్రాన కేసు పరిస్థితులు మారినట్లు కాదని స్పష్టం చేసింది. సీబీఐ కోర్టులో జరుగుతున్న కేసులో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. పలు కేసుల్లో ఇంకా అభియోగాలు నమోదు కావాల్సి ఉందని చెప్పింది.

జగన్ కూడా పౌరులందరిలో ఒకరు..

హాజరు మినహాయింపు కోరడం నిందితుల హక్కు కాదని, కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ప్రజా విధుల్లో ఉన్నంత మాత్రానే హాజరు మినహాయింపు కోరడం ఆర్టికల్ 14కి విరుద్ధమని పేర్కొంది. చట్టం ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పౌరులందరూ సమానమేనని స్పష్టం చేసింది. సీబీఐ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు వైఎస్ జగన్ పిటిషన్లపై ఏప్రిల్ 9న విచారిస్తామంటూ వాయిదా వేసింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-