ఆర్టీసీ కార్మికులకు కేంద్రం తీపికబురు

0

52 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఊరటనిచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై ఉక్కుపాదం మోపి సమ్మెను కాలరాయడం.. చివరకు కార్మికులే వెనక్కి తగ్గి సమ్మె విరమించడం తెలిసిందే. అయితే తాజాగా తమ ఉద్యోగాల్లో తాము చేరుతామని వస్తున్న ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ సర్కారు తీసుకోవడం లేదు. వీరి విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తోంది.

అయితే తాజాగా కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న కేసీఆర్ నిర్ణయానికి కేంద్రం అడ్డుచెప్పేలా నిర్ణయం తీసుకోబోతోందని తెలిసింది. తాజాగా కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇదే విషయం చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటీకరించనీయమని.. ఏదో ఒక పరిష్కారం చూపుతామని తెలిపారు. కేంద్రం ఆమోదం లేకుండా ఆర్టీసీని కేసీఆర్ ప్రైవేటీకరించడం సాధ్యం కాదని తెలిపారు.

1950 రోడ్డు రవాణా సంస్థ చట్టంలోని 39వ సెక్షన్ ప్రకారం కేంద్రం ఆమోదిస్తేనే ఆర్టీసీ విలీనం లేదా మూసివేయడమో.. ప్రైవేటీకరణ చేయాల్సి ఉంటుందని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు.

గడ్కరీ ప్రకటన నేపథ్యంలో ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి చేస్తున్న కేసీఆర్ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడనుంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటీకరిస్తే ఉద్యోగ భద్రత ఉండదని ఆందోళన చెందిన ఆర్టీసీ కార్మికులకు కేంద్రం నిర్ణయం ఊరటగానే చెప్పవచ్చు.
Please Read Disclaimer