మాజీ సీఎస్ ఎల్వీని కొట్టారు.. జగన్ సర్కారుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

0

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలిండియా సర్వీస్ అధికారులను సైతం వదలకుండా వేధిస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుమతి లేకుండా ఓ ఐఏఎస్ జారీ చేస్తున్న జీవోలపై నోటీసు ఇస్తే ఎల్వీ సుబ్రహ్మణ్యంను పిలిపించి.. దబాయించారని వ్యాఖ్యానించారు. అలాగే ఆయన్ను కొట్టారని కూడా అంటున్నారని ఆరోపించారు. చివరకు ఆయన్ను బాపట్లకు ట్రాన్సఫర్ చేశారని గుర్తు చేశారు. అక్కడ ఉన్న చిన్న అధికారులను కూడా ట్రాన్స్‌ఫర్ చేసి ఎల్వీని అక్కడికి పంపించారని పేర్కొన్నారు.

అమరావతి పరిరక్షణ సమష్టి బాధ్యత

రాజధాని అమరావతి పరిరక్షణ 5 కోట్ల ప్రజల సమష్టి బాధ్యతని చంద్రబాబు అన్నారు. అమరావతి విషయంలో సీఎం జగన్‌ వ్యవహరిస్తున్న తీరును జాతీయ మీడియా కూడా ఎండగడుతోందని వివరించారు. ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్‌లను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ రాష్ట్రం ఏమవుతుందో.. ఎక్కడికి పోతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

మూడు రాజధానులు విఫల ప్రయోగం

మూడు రాజధానులు ఎక్కడా విజయవంతం కాలేదన్నారు. దక్షిణాఫ్రికాలో తప్ప ఎక్కడా మూడు రాజధానులు లేవని, ఆ దేశ ప్రధాని కూడా రాజధానులు ఒక చోట పెట్టాలనే నిర్ణయానికి వచ్చారని తెలిపారు. దీనిపై ఆ దేశాక్షుడు మాట్లాడిన మాటలను ప్రదర్శించారు. మూడు రాజధానులతో తిరిగేందుకు ఖర్చులు పెరుగుతాయని, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా పెంచాల్సి ఉంటుందన్నారు. సమయం, ఖర్చు గురించి ఆలోచించరా అని ప్రశ్నించారు.

మీరు డిక్టేక్టర్స్ కాదు..

కేవలం పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి జరగదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏం పాపం చేసిందని ప్రజా వేదికను కూల్చేశారని ప్రశ్నించారు. ఆ భవనాన్ని వేరే అవసరాలకు వినియోగించాల్సింది కదా? అని నిలదీశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇది విద్వేషానికి పరాకాష్ఠ అని దునుమాడారు. మీరు డిక్టేటర్స్‌ కాదని, ఇది ప్రజాస్వామ్యమని స్పష్టం చేశారు. అంతా మీ ఇష్టప్రకారం జరగదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని హితవు పలికారు. ఇష్టానుసారం చేస్తే ఎంతటి వారికైనా ఈరోజు కాకపోయినా రేపైనా శిక్ష పడితీరుతుందని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.

రద్దుల ముఖ్యమంత్రిగా ఖ్యాతి

విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌ వస్తే లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేవని, కానీ దాన్ని రద్దు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. మీ వల్ల రూ. 79 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. లులు కంపెనీ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు దక్కేవని, విశాఖలో తెచ్చిన అనేక సంస్థలను మధ్యలో వదిలేశారని తెలిపారు.

విశాఖలో ఎలా ల్యాండ్ పూలింగ్ చేస్తారు?

విశాఖలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం, మెట్రో రైలు, సుజల స్రవంతి ప్రాజెక్టులను వదిలేశారని విపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. విశాఖపట్నం జిల్లాలో ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా 6,112 ఎకరాలు తీసుకుంటున్నారని.. అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ను విమర్శించి అక్కడెలా చేస్తారని ప్రశ్నించారు. ఒంగోలులో పేపర్‌ మిల్లు వెనక్కి మళ్లిందని, సింగపూర్‌ కంపెనీలను సైతం ప్రైవేటు కంపెనీలని ప్రచారం చేస్తున్నారు విమర్శించారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ద్రోహులెవరు?

ఉత్తరాంధ్ర, రాయలసీమకు ద్రోహం చేసిందెవరని చంద్రబాబు ప్రశ్నించారు. గుండ్రేవుల, వేదవతి, రాజోలిబండ, భైరవాని తిప్ప ప్రాజెక్టులు ఆపేశారని, సాగునీటి ప్రాజెక్టులకు 9 నెలల్లో రూపాయైనా ఖర్చు పెట్టారా అని నిలదీశారు. సీఎం జగన్ చేస్తున్న పనులకు కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయని, సీఎస్‌ స్థాయి వ్యక్తిని బాపట్లకు పంపించడం దారుణమన్నారు. పీపీఏల సమీక్ష వద్దని కేంద్రం చెప్పినా వీళ్లు వినలేదని తెలిపారు.

విద్వేషం తప్ప పాలనపై దృష్టి లేదు

కక్ష సాధింపు, విద్వేషం తప్ప సీఎం జగన్‌కు పరిపాలనపై దృష్టి లేదని చంద్రబాబు విమర్శించారు. కక్షలు, కార్పణ్యాలకు ఇది సందర్భమా? అని ప్రశ్నించారు. అమరావతిలో 10 వేల ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్ల సంపద వచ్చేదన్నారు. అమరావతి రైతులపై మీకు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. విశాఖ, కర్నూలులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

‘హోదా’ గురించి ఎప్పుడైనా మాట్లాడారా?

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల్లో రూ. 72 వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. పన్ను వసూళ్లు బాగా తగ్గిపోయాయని, అప్పులు మాత్రం 16 శాతం పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం కూడా 6 శాతం పెరిగిందన్నారు. వీరి చేతకాని విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని హితవు పలికారు. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు ఎందుకు నిధులివ్వలేదని ప్రశ్నించారు. విద్యార్థులకు ఈ ఏడాది ఉపకార వేతనం ఇచ్చారా? అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా మాట్లాడారా? మనకు రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని అడిగారా అని వరుస ప్రశ్నలు సంధించారు. కుంటిసాకులు చెప్పి అన్ని పథకాల్లో కోతలు పెడుతున్నారని ఆరోపించారు. అన్నీ రద్దు చేసి రైతు భరోసా ఇచ్చారని, అందులోనూ అనేక నిబంధనలు పెట్టారని తెలిపారు.

అజయ్ కల్లాంరెడ్డి.. రాజకీయాల్లో చేరు

ఆలిండియా అధికారులను కూడా ఈ ప్రభుత్వం వదలట్లేదని చంద్రబాబు విమర్శించారు. ఇందుకు ఎల్వీ సుబ్రహ్మణ్యంపై వీరి చర్యలే నిదర్శనమన్నారు. కొందరు ఐఏఎస్‌లు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వారంతా జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడి ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే తమ ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో వారందరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మాజీ సీఎస్ అజయ్ కల్లాం రెడ్డికి ఇష్టం ఉండే రాజకీయాల్లో చేరాలని సూచించారు. ఎంపీగా పోటీ చేసి గెలవాలని సలహా ఇచ్చారు. అంతేగాని ప్రభుత్వ అధికారి అనే ట్యాగ్ ఉంచుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు.
Please Read Disclaimer