చంద్రబాబు అరెస్ట్.. బెంజి సర్కిల్ వద్ద ఉద్రిక్తత

0

అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ర్యాలీగా ఆటోనగర్ వరకూ పాదయాత్రగా వెళ్లేందుకు యత్నించారు. అయితే ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు ససేమిరా అనడంతో చంద్రబాబు అక్కడు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దఎత్తున తరలివచ్చిన అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు, టీడీపీ కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా జేఏసీ 13 జిల్లాల బస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. జేఏసీ కార్యాలయం ప్రారంభించిన తరువాత ర్యాలీగా వెళ్లి బస్సుయాత్రను ప్రారంభించాలని జేఏసీ నేతలు భావించారు. జేఏసీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించిన అనంతరం బస్సుల వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. చట్టప్రకారం అన్ని అనుమతులతో బస్సు యాత్ర చేపట్టారని.. అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బస్సులను తక్షణం విడిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సెక్యూరిటీ కారణాలతో బస్సు యాత్రను అడ్డుకోవడం తగదని చంద్రబాబు మండిపడ్డారు.

పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోవపోవడంతో చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో ఎక్కించి తరలించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, సీపీఐ నేత రామక్రిష్ణ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులతో విజయవాడలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Please Read Disclaimer