జగన్ ప్రభుత్వానికి మన మీద చాలా ప్రేమ.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

0

జగన్ సర్కార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి మన మీద చాలా ప్రేమ పుట్టుకొచ్చిందని చంద్రబాబు అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో జేఏసీ నేతల అరెస్టులను ఉద్దేశించి చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బెంజ్ సర్కిల్‌ నుంచి బయలుదేరిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు.

ర్యాలీని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నిస్తే పోలీసులు పొంతనలేని సమాధానాలు చెప్పారని చంద్రబాబు అన్నారు. జేఏసీ నేతలు ర్యాలీ రూట్ మ్యాప్ ఇవ్వలేదని.. అందుకే ర్యాలీని అడ్డుకున్నామని పోలీసులు చెప్పారన్నారు. మన సెక్యూరిటీ కోసమే ర్యాలీని అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారని.. జగన్ ప్రభుత్వానికి మన మీద ప్రేమ పుట్టుకొచ్చిందంటూ సెటైర్లు వేశారు.

అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు బందర్ వీధుల్లో చంద్రబాబు జోలెపట్టి అమరావతి ఉద్యమానికి విరాళాలు సేకరించారు. అదే జోలెతో బహిరంగ సభ వేదికపైకి వచ్చిన చంద్రబాబు.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బస్సు యాత్రకు భయపడి బస్సులను సీజ్ చేశారని మండిపడ్డారు.

శాంతి భద్రతల సమస్య పేరుతో అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ దొంగల వల్లే శాంతి భద్రతల సమస్య అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం అమరావతి మహిళలు రోడ్డుపైకి వచ్చారని.. స్వచ్ఛందంగా ఆభరణాలు సైతం విరాళంగా అందజేశారని ప్రశంసించారు. అమరావతి ప్రజా రాజధాని అని.. రాజధానిని తరలించడం ఎవ్వరికీ సాధ్యం కాదన్నారు.
Please Read Disclaimer