అన్యాయం జరిగితే పోరాడటం మన బాధ్యత.. వంశీ లేఖకు బాబు రిప్లై

0

ఎమ్మెల్యే పదవితోపాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాదు, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై చంద్రబాబుకు రాసిన లేఖపై టీడీపీ అధినేత స్పందించారు. లేఖలో వంశీ పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు తిరిగి లేఖ రాశారు. వాట్సాప్ ద్వారా వంశీ పంపిన లేఖ అందిందని, వ్యక్తిగతంగానూ ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకొచ్చినట్టు చంద్రబాబు తెలిపారు. టీడీపీతోపాటు గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సమర్థంగా పనిచేశారని ప్రశంసించారు. గన్నవరం వైఎస్ఆర్‌సీపీ ఇంఛార్జ్ కొంతమంది అధికారులతో కలిసి టీడీపీ కార్యకర్తలను, తనను వేధింపులకు గురిచేస్తున్నట్టు వంశీ తన లేఖలో పేర్కొనగా.. ఉద్దేశపూర్వకంగానే అధికార పార్టీ ఈ చర్యలకు పాల్పడుతోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

తమ ప్రభుత్వ హయాంలో పేదలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నామని, ఇందులో భాగంగా ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వేధింపులను పార్టీ పరంగా ఎదుర్కొందామని అన్నారు. ఎప్పుడు అన్యాయం జరిగినా తలదించుకోకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం మన బాధ్యతని, ఈ అంశంలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్‌సీపీ వేధింపులను, మీకు జరిగిన అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని, దీనిని ప్రజల్లోకి తీసుకెళదామని అన్నారు.




Please Read Disclaimer