వైకాపాకు ఆ దమ్ముందా? : చంద్రబాబు

0

ప్రజలందరూ సంఘటిత శక్తిగా మారాలని.. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మచిలీపట్నంలోని కోనేరు సెంటర్‌లో రాజధానిగా అమరావతికి మద్దతుగా ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అమరావతిని సాధించుకునే విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఒకే వేదికపై నిలబడి పనిచేస్తున్నాయన్నారు. ఐకాస ఏర్పాటు చేసి అన్ని పార్టీలు ఏకమయ్యాయని చెప్పారు. ప్రజలను చైతన్యవంతం చేయడానికి బస్సు యాత్ర తలపెడితే చివరి నిమిషంలో శాంతి భద్రతల సమస్య ఉందని పోలీసులు అనుమతి నిరాకరించడంపై మండిపడ్డారు. డీజీపీని కలిసి కోరినా బస్సు యాత్రకు అనుమతి ఇవ్వలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజలు, దేవుళ్ల ఆశీస్సులు రాజధాని అమరావతికి ఉన్నాయని.. దాన్ని కదిలించే శక్తి ఎవరికీ లేదని చంద్రబాబు అన్నారు. ప్రజల కోసం తన జీవితంలో తొలిసారిగా జోలె పట్టానని చెప్పారు. రాజధానిలో నిర్మాణాలపై ‘ఈనాడు’ పత్రికలో వాస్తవాలు ప్రచురించారంటూ ఆ కథనాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రదర్శించారు. రాజధాని కోసం 10 మంది రైతులు మృతిచెందినా సిగ్గు అనిపించలేదా? అని వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి దుయ్యబట్టారు. మృతుల కుటుంబాలను పరామర్శించే నైతిక బాధ్యత కూడా అధికార పార్టీ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కావాలనే విద్యుత్‌ సరఫరా ఆపేశారని మండిపడ్డారు. దీంతో సభలో ఉన్న వారంతా తమ మొబైల్‌ ఫోన్లు ఆన్‌ చేశారు. అక్కడికి కాసేపటికే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

ఆ దమ్ముందా?

రాజధాని అంశంపై వైకాపాకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు సవాల్‌ విసిరారు. అలా ఎన్నికలు జరిగి మళ్లీ వైకాపా గెలిస్తే నచ్చిన చోట రాజధాని కట్టుకోవాలన్నారు. అప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పును తానూ గౌరవిస్తానని చెప్పారు. అమరావతి నుంచి పాలన సాగడానికి అన్ని వసతులూ ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ఈ ఇది ప్రజా ఉద్యమమని.. రాజధానిగా అమరావతిని కొనసాగించేందుకు విజయవంతంగా సాగుతోందన్నారు. ఈ పోరాటంలో పాల్గొనేందుకు ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలని పిలుపునిచ్చారు. బిడ్డల భవిష్యత్‌ కోసం ఈ పోరాటం కొనసాగించాలని.. తమ భవిష్యత్‌ పోతోందని యువత గ్రహించి ఆందోళనలో పాల్గొనాలని చంద్రబాబు కోరారు.

కేబినెట్‌ సమావేశంలోపు ప్రకటించాలి: రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

సీఎం జగన్‌ తన పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని మార్పుపై చెప్పారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఇప్పుడు దాన్ని మారుస్తామని ఎందుకు అంటున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో జగన్‌ డ్రామాలాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఈ నిర్ణయాన్ని ప్రజలెవరూ ఆమోదించరన్నారు. కేబినెట్‌ సమాశం నిర్వహించేలోపు రాజధానిపై ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలని.. లేదంటే అన్ని జిల్లాల్లోనూ తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు. అరెస్టులకు భయపడేదిలేదని.. జైలుకు పోయినా పోరాడి తీరుతామని అమరావతిని సాధిస్తామని చెప్పారు.

మహా ఉద్యమంగా మారుతుంది: శివారెడ్డి, ఐకాస కన్వీనర్‌

అమరావతి కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఈ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తోందని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి ఆరోపించారు. ప్రజల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఇది కచ్చితంగా మహా ఉద్యమంగా మారుతుందని.. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రైతులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమరావతి ఆంధ్రుల హక్కు అని ఆయన నినదించారు.

 అమరావతి కోసం ఒక్కతాటిపైకి వచ్చాం: గోపాలకృష్ణ,  భాజపా నేత

ఎన్నికల్లో రాజకీయంగా ఆరోపణలతో తాము కత్తులు నూరుకున్నా.. అమరావతి కోసం ఒక్క తాటిపైకి వచ్చామని భాజపా నేత గోపాలకృష్ణ అన్నారు. రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించకూడదని భాజపా డిమాండ్‌ చేస్తోందన్నారు.

అవకాశమిస్తే ప్రజల్ని రోడ్లపైకి తీసుకొచ్చారు: వర ప్రసాద్‌, ఆప్‌ నేత

ప్రజలు జగన్‌కు అధికారం అప్పగించి అవకాశమిస్తే ప్రజల్ని రోడ్లపైకి తీసుకొచ్చారని ఆప్‌ నేత వర ప్రసాద్‌ అన్నారు. ప్రశ్నించే సమయం ఆసన్నమైందని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమను కూడా సమానంగా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.

ఉప్పు సత్యాగ్రహంలా అనిపించింది: బాలాజీ, జనసేన నేత

అమరావతి పోరాటం కోసం చంద్రబాబు జోలె పట్టి వస్తుంటే నాడు ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ మచిలీపట్నం వచ్చి ఏవిధంగా ప్రజల మద్దతు కూడగట్టారో అదే స్థాయిలో అనిపించిందని జనసేన నేత బాలాజీ అన్నారు. రాజధాని అంశంపై సీఎం జగన్‌ చేసిన ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. 
Please Read Disclaimer