‘చంద్రయాన్‌ -2’ చూసి హడలిపోయిన ఆస్ట్రేలియా

0

అది ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్. రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో అక్కడి ప్రజలంతా ఆకాశంలోకి చూడటం మొదలుపెట్టారు. ఏదో ఓ కాంతి.. నెమ్మదిగా కదలడం చూసి గ్రహశకలం భూమిపైకి దూసుకొస్తోందని కంగారు పడ్డారు. అది గ్రహశకలం కాదని, గ్రహాంతరవాసులు అంతరిక్ష నౌక (యూఎఫ్‌వో) అని మరికొందరు ఆందోళనకు గురయ్యారు. అయితే, అది గ్రహశకలమూ కాదు.. యూఎఫ్‌వో కాదు. సోమవారం ఇస్రో ప్రయోగించిన ‘చంద్రయాన్ – 2’ రాకెట్ కాంతి.

మధ్యాహ్నం 2.43 గంటలకు ఇండియా ‘చంద్రయాన్ – 2’ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో చీకటి పడింది. దీంతో ఆకాశంలోని చీకటిని చీల్చుకుంటూ దూసుకెళ్తున్న మన రాకెట్ వారికి స్పష్టంగా కనిపించింది. రాత్రి వేళ కావడంతో కేవలం కాంతి మాత్రమే కనిపించింది. ఇండియా ఈ ప్రయోగం చేసిందనే సమాచారం తెలియక ప్రజలు తొలుత ఆందోళనకు గురయ్యారు. గ్రహశకలం, యూఎఫ్‌వోలు భూమి వైపుకు వస్తున్నాయని కంగారు పడ్డారు. చివరికి అసలు విషయం తెలుసుకుని ‘హమ్మయ్య’ అనుకున్నారు. ఆ తర్వాత నవ్వుకున్నారు.

మెకిన్లే షైర్ కౌన్సిలర్ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆ సమయంలో మేం కారావన్ పార్క్‌లో ఉన్నాం. ఆ సమయంలో అక్కడ 160 మంది వరకు ఉన్నారు. వారంతా ఆకాశంలోకి చూస్తూ.. పైకి చూడండని అన్నారు. పైకి చూస్తే కాంతిమంతమై వెలుగు కనిపించింది. మూడు నిమిషాల తర్వాత అది మాయమైంది. కానీ, అదేమిటో అర్థం కాలేదు. అది చాలా భిన్నంగా ఉంది’’ అని తెలిపారు. అప్పటికి అది ఇండియా ప్రయోగించిన ‘చంద్రయాన్ – 2’ రాకెట్ అని తెలియదు. దీంతో రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారు. మంగళవారం వార్తాపత్రికలు, న్యూస్ చానెల్‌లో వార్తలు చూసిన తర్వాత తమ పొరపాటు తెలుసుకున్న ఆస్ట్రేలియన్లు.. ఎంత పనిచేశావ్ ఇండియా అంటూ నవ్వుకున్నారు.