దొరికిన చంద్రయాన్2 ల్యాండర్

0

చంద్రయాన్2 ఆపరేషన్ లో చివరి నిమిషంలో సిగ్నల్స్ కట్ అయిపోయి నిరాశలో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలకు గుడ్ న్యూస్ లభించింది. చంద్రుడి చుట్టు తిరుగుతున్న ఇస్రో ప్రయోగించిన ఆర్బిటర్ తాజాగా చంద్రుడిపై దిగిన ల్యాండర్ విక్రమ్ ఆచూకీని కనుగొంది. ఈ మేరకు చంద్రుడి ఉపరితలంపై ఉన్న ల్యాండర్ థర్మల్ చిత్రాలను ఆర్బిటర్ తీసిందని ఇస్రో చైర్మన్ శివన్ స్వయంగా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో త్వరలోనే ల్యాండర్ తో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉందని.. దానికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఇస్రో చైర్మన్ తెలిపారు. ల్యాండర్ తో కనుక సంకేతాలు కనెక్ట్ అయితే భారత్ ప్రయోగించిన చంద్రయాన్2 విజయవంతమైనట్టే లెక్క.

ప్రస్తుతం ఆర్బిటర్ గుర్తించిన విక్రమ్ ల్యాండర్ చిత్రాలను ఇస్రో విశ్లేషిస్తోంది. ల్యాండర్ కూలిందా.? బాగుందా? ధ్వంసమైందా.. పనిచేస్తుందా అన్నదానిపై విశ్లేషిస్తున్నారు. చంద్రయాన్2 పై నిరాశ చెందిన భారత ప్రజలంతా ఇప్పుడు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఆర్బిటర్ కనిపెట్టడంతో ఊరట చెందారు. దీనికి సిగ్నల్స్ కోసం ఇస్రో శాస్త్ర వేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు.

కాగా చంద్రయాన్ 2 ఆపరేషన్ లో ప్రధాన ఘట్టమైన ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపైకి దిగుతుండగా 2.1 కి.మీల ఎత్తులో ఇస్రోతో సంబంధాలను కోల్పోయింది. సిగ్నల్స్ కట్ అయిపోవడంతో ల్యాండర్ విక్రమ్ ఏమయ్యిందన్నది శాస్త్రవేత్తలకు అంతుబట్టలేదు. ఇప్పుడు తాజాగా చంద్రుడి చుట్టు తిరుగుతున్న చంద్రయాన్ ఆర్బిటర్ విక్రమ్ ను గుర్తించి ఫొటోలు తీయడం విశేషం.
Please Read Disclaimer