మోడీ మాష్టారికి అదిరే ట్వీట్ పంచ్ వేసిన చిదంబరం తంబి

0

ఎంత పాలు పోసినా.. ప్రేమించినా.. దాన్ని అల్లారు ముద్దుగా చూసుకున్నా పాము పామే. అదే రీతిలో కనిపిస్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన రాజకీయ ప్రయోజనాల కోసం దేనికైనా సరే సై అనేసే ఆయన.. స్నేహం లాంటి వాటిని అస్సలు పట్టించుకోరు. ఆ మాటకు వస్తే.. అమెరికా తీరే ఆ రకంగా ఉంటుంది. వాడి పారేయటంలో ట్రంప్ వారి తర్వాతే ఎవరైనా. భారత్ కు వచ్చినప్పుడు.. మోడీ అమెరికాకు వెళ్లినప్పుడు భారత్ ను తెగ పొడిగేసే ఆయన.. తాజాగా తన సీటు కిందకు నీళ్లు వచ్చిన వేళలలో.. ఎవరి మీద పడితే వారిని ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసే ఆయన.. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ఇరువురు అభ్యర్థులు మధ్య చర్చా కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన చైనా.. రష్యా.. భారత్ ఈ మూడు దేశాల మీద ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశారు. చాలా కారణాలకు భారత్ ను వేలెత్తి చూపిన ఆయన.. కరోనా కేసుల విషయంలోనూ.. మరణాల విషయంలోనూ భారత సర్కారు దాచి పెడుతుందని నోటికి పని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు మోడీ సర్కారుకు షాకింగ్ గా మారాయి. ఇలాంటివేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ కేంద్రమంత్రి చిదంబరం మాష్టారు సీన్లోకి వచ్చారు.

తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. మోడీకి తనదైన శైలిలో ట్వీట్ షాకిచ్చారు. భారత్ గురించి ట్రంప్ ఇంతలా చెప్పిన తర్వాత కూడా భవిష్యత్తులో ప్రధాని మోడీ మరోసారి నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. రష్యా.. చైనాలతో కలిపి భారత్ కూడా కరోనా వైరస్ లెక్కల్ని.. మరణాల్ని దాచి పెట్టినట్లుగా ట్రంప్ నోరు పారేసుకున్నారు. అంతేకాదు.. కాలుష్యం పెరుగుదలకు.. వాతావరణంలో మార్పులకు కూడా భారత్ పై విమర్శలు చేయటాన్ని తప్పు పట్టారు.

ఈ సమయంలోనూ తన మిత్రుడు ట్రంప్ తోనూ మరో నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నిర్వహిస్తారా? అంటూ చురకలు వేశారు. ఈ ఫిబ్రవరిలో అహ్మదాబాద్ లో నమస్తే ట్రంప్ పేరుతో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించటం.. ఆ సందర్భంగా మోడీని ట్రంప్.. ట్రంప్ ని మోడీ పొగిడేసుకోవటం తెలిసిందే. భారత్ ను అమెరికా ప్రేమిస్తోందని చెప్పటమే కాదు.. భారీ ఎత్తున ప్రాజెక్టుల్ని తీసుకెల్లిపోయిన ట్రంప్.. ఎన్నికల నాటికి భారత్ మీద విమర్శలు.. ఆరోపణలు చేయటం చూస్తే.. ట్రంప్ ఏ మాత్రం భారత్ కు విశ్వసనీయమైన నేత కాదని చెప్పక తప్పదు. మరి.. చిదంబరం తంబి వేసిన పంచ్ కు.. మోడీ మాష్టారు ఎప్పటికి రియాక్టు అవుతారో చూడాలి.