అక్కడ 20 ఏళ్ల పాటు కరోనా మనుగడ!

0

కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కరోనా వైరస్ పై విస్తృత పరిశోధనలు చేసిన చైనా దేశ వైద్య నిపుణురాలు లీ ల్యాన్ జువాన్ తాజాగా పలు సంచలన విషయాలను వెల్లడించారు. కరోనా నిపుణుల బృందంలో ఈమె సభ్యురాలు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కరోనా దశాబ్ధాల పాటు జీవించి ఉండగలదని.. మైనస్ 4 డిగ్రీల్లో కొన్ని నెలల పాటు జీవిస్తుందని వివరించింది. మైనస్ 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద 20 ఏళ్లకు పైగా బతికి ఉంటుందని ఆమె సంచలన విషయాలు వెల్లడించారు. శీతల పరిస్థితులను కరోనా బాగా తట్టుకుంటుందని డాక్టర్ లీ తెలిపారు. శీతల దేశాల్లో ఇది సులభంగా వ్యాపిస్తుందని తెలిపారు. అత్యంత శీతల ప్రదేశాల్లో కరోనా ఎక్కువ కాలం జీవిస్తుందని తేలిందన్నారు. మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వచేసే సీఫుడ్ మార్కెట్లలోనే ఈ వైరస్ బయటపడిందని తెలిపారు. కొన్నాళ్ల పాటు పచ్చి మాంసం చేపలు తినకుండా ఉంటే మంచిదని సూచించారు.

కాచి చల్లార్చిన నీళ్లు తాగడం.. వేడి వేడి ఆహార పదార్థాలు తినడం.. పండ్ల తొక్కలతోనే తినడం.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల కరోనాను నియంత్రించవచ్చని చైనా పరిశోధకులు తెలిపారు.

తాజాగా చైనా రాజధాని బీజింగ్ లోని అతిపెద్ద ఫుడ్ మార్కెట్ లో 18పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రెస్టారెంట్లు క్యాంటీన్లలో పనిచేసేవారికి పరీక్షలు చేస్తున్నారు.

చైనా నిపుణుల ప్రకటనతో వచ్చే చలికాలం కరోనా మరింత విజృంభించడం ఖాయంగా కనిపిస్తోంది. వేడిగా ఉండే భారత్ కంటే శీతల దేశాలైన యూరప్ సహా అమెరికా ఉత్తర ప్రాంతం కెనడా ఇతర చలి తీవ్రత దేశాలకు ఇది డేంజర్ అని చెప్పవచ్చు.
Please Read Disclaimer