ఏపీ ఎన్నికలు.. అసెంబ్లీకి 3,245.. పార్లమెంటుకు 472 నామినేషన్లు

0

తొలి దశ సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగిసింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ స్థానాలతోపాటు ఏపీ శాసనసభకు తొలి దశలోనే ఎన్నికలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇక, ఏపీలోని 175 శాసనసభ స్థానాలకు 3,279 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలకు 370 నామినేషన్లు దాఖలు కాగా తర్వాతి కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు 350, కర్నూలు జిల్లాలోని 14 స్థానాలకు 344, తూర్పుగోదావరిలోని 19 స్థానాలకు 319, అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 288, చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు 287, విశాఖపట్నం జిల్లాలోని 15 స్థానాలకు 245, పశ్చిమ గోదావరి జిల్లాలలోని 15 స్థానాలకు 244, ప్రకాశం జిల్లాలో 10 స్థానాలకు 236, కడప జిల్లాలో 10 స్థానాలకు 217, శ్రీకాకుళం జిల్లాలోని 10 స్థానాలకు 146, నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు 129, విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు 111 నామినేషన్లు వేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.

నియోజకవర్గం వారిగా చూసుకుంటే నంద్యాల అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 42 మంది నామినేషన్‌ వేశారు. దీని తర్వాత స్థానంలో కడప జిల్లా జమ్మలమడుగు 39, మంగళగిరిలో 37, పులివెందుల 23 మంది చొప్పున నామినేషన్‌ వేశారు. రంపచోడవరం, తుని, కాకినాడ నగరం, పాతపట్నం నియోజకవర్గాల్లోనూ ఒక్కోచోట 20 మందికి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇక ఏపీలోని 25 పార్లమెంటు స్థానాలకు గాను 472 మంది నామినేషన్‌ వేశారు. అత్యధికంగా నంద్యాల పార్లమెంటుకు 36, తర్వాతి స్థానంలో గుంటూరు 25, విశాఖపట్నం 24, కడప 24, కర్నూలు 23, అనంతపురం 23, మచిలీపట్నం 22, నర్సాపురం 20, విజయవాడ 19, నరసరావుపేట 19 నామినేషన్లు వచ్చినట్టు తెలిపారు. నామినేషన్ల పరిశీలన మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజుల పరిశీలన ఉండగా, ఉపసంహరణకు గడువు మార్చి 28.
Please Read Disclaimer