ఆత్మీయ భోజనం..కేసీఆర్ చెప్పిన తీపి కబుర్లివే!

0

మాట ఇచ్చినట్లుగానే…ఆర్టీసీ కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో మధ్యాహ్న భోజనం చేశారు. భోజనాల అనంతరం కార్మికులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. కార్మికులతో ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళా సిబ్బంది సహా ఐదుగురు చొప్పున మొత్తం 97 డిపోల నుంచి కార్మికులు – రవాణాశాఖ ఉన్నతాధికారులు – ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారు. ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 97 డిపోల నుంచి డిపోకు ఐదుగురు చొప్పున కార్మికులు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ – ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ – ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ – ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి మద్యాహ్న భోజనం చేసిన కేసీఆర్ – తర్వాత రెండు గంటల పాటు వారితో సమావేశమయ్యారు. సహృద్భావ వాతావరణంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రతీ అంశంపైనా – ప్రతీ సమస్యపైనా సీఎం కేసీఆర్ స్పందించారు. అప్పటికప్పుడు పరిష్కరించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని – ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం ఆర్టీసీకి రావాలని – ప్రతీ ఉద్యోగీ ఏడాదికి లక్ష రూపాయల బోనస్ అందుకునే స్థితి రావాలని ఆకాంక్షించారు.

వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్ లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని సోమవారమే అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కాగా కేసీఆర్ హామీలతో ఆర్టీసీ కార్మికులు ఖుష్ అవుతున్నారు
Please Read Disclaimer