అమరావతి నిర్మాణాలపై జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్.. కానీ? కేంద్రం ఎఫెక్ట్!

0

అమరావతి విషయమై జగన్ సర్కారు సానుకూల ధోరణిని వ్యక్తం చేసింది. సోమవారం రాత్రి సీఆర్డీఏపై సమీక్ష జరిపిన సీఎం జగన్ రాజధాని నిర్మాణ పనులను కొనసాగించాలని నిర్ణయించారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న పనులను తిరిగి కొనసాగించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని పనులను సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యతల ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు అనుగుణంగా పనులు ఉండాలన్నారు.

జగన్ ఆదేశాలు..

సీఆర్డీఏ పరిధిలో ప్లానింగ్‌ పొరబాట్లు ఉండొద్దని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన జగన్ సర్కారు.. అమరావతి పనుల విషయంలోనూ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని సీఎం నిర్ణయించారు

హింట్ ఇచ్చిన బొత్స..

సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. 50 శాతానికిపైగా పూర్తయిన భవనాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. హ్యాపీ నెస్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామన్నారు. ఇప్పటి వరకూ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చాకే నిర్ణయం తీసుకుంటామన్న జగన్ సర్కారు.. తాజాగా అమరావతి భవనాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పడం గమనార్హం.

హ్యాపీనెస్ట్‌పై రివర్స్ టెండరింగ్..

హ్యాపీనెస్ట్‌ అనేది అమరావతిలో ప్రకటించిన తొలి ప్రజానివాస సముదాయం. ఈ ప్రాజెక్టును ప్రకటించిన కొద్ది గంటల్లోనే 1,200 ఫ్లాట్లు బుక్‌ అయ్యాయి. వీటిని నేలపాడు వద్ద 12 టవర్లుగా నిర్మించనున్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కాంట్రాక్టును గత ప్రభుత్వం షాపూర్ జీ-పల్లోంజీ గ్రూప్‌కి అప్పగించింది. ఈ ప్రాజెక్టుకు రివర్స్ టెండర్ల కోసం జగన్ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇండియా మ్యాప్‌లో అమరావతి

ఏపీ రాజధాని అమరావతి లేకుండా కేంద్రం ఇండియా మ్యాప్‌ను విడుదల చేసింది. ఆంధ్ర రాజధాని లేకుండా మ్యాప్ విడుదల చేయడం పట్ల టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పార్లమెంట్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే.. కేంద్రం అమరావతితో కూడిన భారత మ్యాప్‌ను రిలీజ్ చేసింది. దీంతో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా భారత సర్కారు గుర్తించినట్టయ్యింది.
Please Read Disclaimer