నాకే గనక, నీతోనే గనక.. కాలేజీ అమ్మాయిలకు ప్రొఫెసర్ టిక్‌టాక్ వీడియోలు, అసభ్య ఛాటింగ్

0

నాకే గనక, నీతోనే గనక పెళ్లయితే గనక.. తతత తర్వాత ఏమి చేయాలి.. కకక కాముణ్ని కాస్త అడగాలి.. అంటూ ఈ టిక్ టాక్ వీడియోలో హావభావాలు పలికిస్తున్నది ఏ నటుడో అనుకుంటే పొరపాటే. ఇంజనీరింగ్ కాలేజీలో అతడో ప్రొఫెసర్. ఆ వీడియో ద్వారా చెప్పకనే చెబుతున్న మాటలు ఆ ప్రబుద్ధుడి వద్ద పాఠాలు నేర్చుకుంటున్న ఓ అమ్మాయిని ఉద్దేశించి. కరీంనగర్‌ జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కాలేజీ అమ్మాయిలను లైంగికంగా వేధిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. 

కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్‌లో ఉన్న శ్రీచైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ విభాగంలో సురేందర్ అనే వ్యక్తి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. పరీక్షల్లో మార్కులు తక్కువ చేస్తానని, ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు గురిచేస్తూ అమ్మాయిలను లోబరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు అతడిపై ఆరోపణలు వస్తున్నాయి. 

ప్రొఫెసర్ సురేందర్ పలువురు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చింది. ద్వందార్థాలు వచ్చే పాటలు, డైలాగ్‌లతో టిక్ టాక్ చేసి సదరు వీడియోలను తమకు పంపిస్తున్నాడని కొంత మంది అమ్మాయిలు చెబుతున్నారు. తాజా వీడియో కూడా ఈ కోవలోనిదే. పేరు చెప్పడానికి ఇష్టపడని సదరు అమ్మాయితో అతడు చేసిన ఛాటింగ్ కూడా బయటకొచ్చింది. ‘నీ కళ్లు బాగుంటాయి.. నీ నవ్వంటే ఇష్టం రా..’ అంటూ పొగడ్తలతో మొదలుపెట్టి, ‘రూమ్‌కి రావొచ్చుగా..’ అంటూ బాధిత యువతికి అసభ్య సందేశాలు పంపించాడు. 

పెళ్లాం, పిల్లలున్నారు.. ఇదేంటి సర్! 
కీచక ప్రొఫెసర్ వేధింపులకు తాళలేక, తన బాధను ఎవరికీ చెప్పుకోలేక ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె స్నేహితుల ద్వారా ఈ టిక్ టాక్ వీడియోలు, ఛాటింగ్‌లు వెలుగులోకి వచ్చాయి. 

‘మీకు పెళ్లాం, పిల్లలున్నారు.. ఇదేంటి సర్..’ అంటూ బాధిత యువతి ఆ కీచకుడికి గట్టిగానే సమాధానం ఇచ్చింది. దీంతో అతడు బెదిరింపులకు గురిచేశాడు. సురేందర్ చేష్టలకు భయపడి ఆ విద్యార్థిని కాలేజీకి వెళ్లడమే మానేసింది. ఇంట్లో వాళ్లు ప్రశ్నించగా.. ఏం చెప్పాలో తెలియక బలవన్మరణానికి పాల్పడింది. 

కాలేజీలో చదువుతున్న చాలా మంది అమ్మాయిలను సురేందర్ వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. పరువు పోతుందనే భయంతో చాలా మంది అమ్మాయిలు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. పోలీసుల ముందుకు రావడానికి భయపడుతున్నారు. పరువు పోతుందని అమ్మాయిల తల్లిదండ్రులు కూడా బయటకు చెప్పలేకపోతున్నారు. 

ఈ ఆరోపణలను సురేంద్ర ఖండిస్తున్నారు. తాను ఏదైనా చెప్పుకోవాల్సివస్తే ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పుకుంటానని.. వాళ్లకి అన్నీ తెలుసని చెబుతున్నాడు. సురేందర్ టిక్ టాక్ వీడియోలు వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యం అతడిపై చర్యలకు సిద్ధమవుతోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు..
Please Read Disclaimer