ఆడపిల్ల తండ్రిగా ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తా.. కానీ, జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

0

షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ ఘటనపై కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు గన్ లైసెన్సులు ఇవ్వండని.. తమకు గన్‌మెన్లను తీసేయ్యండని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత ఆడపిల్లలను అత్యాచారం చేసి చంపిన ఘటనలు అనేకం జరుగుతున్నాయని.. వాటిలో ప్రభుత్వం, పోలీసుల దృష్టికి వచ్చినవి కొన్ని మాత్రమేనని ఆయన అన్నారు. చాలా కొద్ది ఘటనలు మాత్రమే హైలెట్ అవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన శనివారం (డిసెంబర్ 7) గవర్నర్ తమిళిసై సౌందరారాజన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కొన్ని సంఘటనలకు మాత్రమే పోలీసులు ఎందుకు స్పందించారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్లే పోలీసులు స్పందించారని ఆయన వివరించారు. ప్రజలందరూ దిశ నిందితులకు బహిరంగ శిక్ష వేయాలని, ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారని.. అందుకే న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.

ఏ ప్రభుత్వమైనా ప్రజల అభీష్టం మేరకే పనిచేయాలని జగ్గారెడ్డి సూచించారు. 90 శాతం మంది ప్రజలు ఎన్‌కౌంటర్ చేయాలన్నారని గుర్తు చేశారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఈ ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నానని చెప్పిన జగ్గారెడ్డి.. ఎమ్మెల్యేగా తనది మరో అభిప్రాయం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అది నా రెండో అభిప్రాయం..
‘దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను నేను సమర్థిస్తున్నాను. ఒక ఆడపిల్ల తండ్రిగా ఈ ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నా. సీపీ సజ్జనార్ కరెక్ట్. కానీ, ఒక శాసనసభ్యునిగా నాకు కొన్ని పరిమితులు ఉంటాయి. చట్టం ప్రకారం నిందితులను శిక్షిస్తే బావుంటుంది అనేది నా రెండో అభిప్రాయం. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు మిస్ యూజ్ అయ్యే ప్రమాదం ఉంది’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

దిశ కంటే ముందే జరిగిన అత్యాచారాలకు పరిష్కారం ఏంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. వారికి కూడా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలోనూ ఎన్‌కౌంటర్ జరిగిందనీ.. కానీ, ఆ తర్వాత కూడా అత్యాచార ఘటనలు ఆగలేదని చెప్పుకొచ్చారు. ఈ సమాజంలో మళ్లీ అత్యాచారం జరిగితే ఎన్‌కౌంటర్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

‘నిత్యానంద స్వామి పైనా చాలా ఆరోపణలు వస్తున్నాయి. నిత్యానందను, ఎవరినైనా ఆడపిల్లలను అత్యాచారం చేసి పూడ్చిపెట్టే వారిని కూడా ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉందా? మానబంగాలు జరగకుండా సరైన పరిష్కారం కోసం ఆలోచించాలి’ అని జగ్గారెడ్డి అన్నారు.

మహిళల రక్షణ కోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి సూచించారు. మహిళల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలు చేయాలని చెప్పారు. సమస్య ఎక్కడుందో దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయాలన్నారు.