26 ఏళ్లకే కాంగ్రెస్ పగ్గాలు: కాంగ్రెస్ సంచలన నిర్ణయం

0

శతాబ్దంన్నర చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కురువృద్ధులు.. వారసత్వం ఉన్న నాయకులను పక్కన పెట్టేసి యువ రక్తం.. పని చేసే సత్తా ఉన్న నాయకులకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తోంది. తాజాగా అలాంటి నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కేవలం 26 ఏళ్ల వయసున్న ఓ యువకుడికి ఏకంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే తొలిసారి అని తెలుస్తోంది.

గుజరాత్ రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా ఆ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే పని చేసే వారికి.. యువరక్తానికి బాధ్యతలు ఇచ్చింది. ఆ క్రమంలోనే పటేల్ ఉద్యమ నాయకుడు.. యువకుడు హార్దిక్ పటేల్‌కు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో హార్దిక్ చేరాడు. చేరి ఏడాది కూడా ముగియకముందే ఏకంగా పార్టీ బాధ్యతలు ఇవ్వడం పార్టీలోనూ.. గుజరాత్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే హార్దిక్ నియామకం వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహం వేరుగా ఉంది. త్వరలోనే 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేస్తోంది. త్వరలోనే మరికొన్ని నిర్ణయాలు తీసుకుని గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటోంది.