Templates by BIGtheme NET
Home >> Telugu News >> బాంబు పేల్చేశారు.. గాలి ద్వారా కరోనా.. ఇన్ని మీటర్ల పరిధిలో!

బాంబు పేల్చేశారు.. గాలి ద్వారా కరోనా.. ఇన్ని మీటర్ల పరిధిలో!


గాలి ద్వారా కరోనా వ్యాపించదని మొదటి నుంచి వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. తాకడం తుమ్ములు దగ్గు తుంపర్ల ద్వారానే ఈ వ్యాధి వ్యాపిస్తుందన్నారు. అయితే కరోనా పై మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నిరంతరం అధ్యయనాలు చేస్తున్నారు. అయితే కరోనా విషయంలో ఎవరికీ ఒక స్పష్టమైన అంచనాలు లేవు. దాని పూర్తి లక్షణాలు కూడా ఎవరూ చెప్పలేరు. అధ్యయనం ద్వారా ఏదైనా గుర్తించినప్పుడు కొత్త లక్షణాల గురించి చెబుతున్నారు. వ్యాధి సంక్రమించే విషయమై కూడా అంతే..వైద్య నిపుణులు ఎవరికి తోచింది వారు చెబుతూ వస్తున్నారు. మొదట్లో డబ్ల్యూహెచ్వో గాలి ద్వారా కరోనా రాదని ప్రకటించగా.. పలు దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి గాలి ద్వారా కూడా సోకే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్వో కు లేఖలు రాశారు. ఆ అంశాలను పరిశీలించిన తర్వాత డబ్ల్యూహెచ్వో కూడా గాలి ద్వారా వ్యాధి సోకే అవకాశం ఉందని అధికారికంగా ప్రకటించింది.

తాజాగా జామా ఇంటర్నేషనల్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం కరోనా గాలి ద్వారా ఏడు నుంచి ఎనిమిది మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి కూడా సోకుతుందని హెచ్చరించింది. కరోనా వ్యాధిగ్రస్తుడు ప్రత్యక్షంగా తాకకపోయినా అతడికి ఏడు నుంచి ఎనిమిది మీటర్ల దూరంలో ఉన్నా గాలి ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని వెల్లడించింది.

చైనాలో ఈ ఏడాది ఆరంభంలో ఒక వ్యక్తి ద్వారా ఇలాగే 24 మందికి ఈ వైరస్ వచ్చినట్లు తేల్చారు. అయితే అప్పటికీ మాస్కు నిబంధనలు అమల్లోకి రాలేదు. కరోనా సోకిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించగా అతడికి 7 నుంచి 8 మీటర్ల దూరంలో ఉన్న 24 మంది ప్రయాణికులు కూడా వైరస్ బారిన పడ్డారని అధ్యయనంలో తేలింది. అయితే మాస్క్ ధరిస్తే మాత్రం ఇంత దూరంలో ఉన్నప్పటికీ ఎటువంటి ప్రభావం ఉండదు. గాలి ద్వారా కూడా కరోనా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.