అదే జరిగితే.. దేశంలో 25 కోట్ల మందికి కరోనా?

0

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. భయాందోళనలకు గురి చేసే విశ్లేషణ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ప్రఖ్యాత జాన్ హాప్ కిన్స్ వర్సిటీతో పాటు.. సీడీడీఈపీ (సెంట్రల్ ఫర్ డైనమిక్స్.. ఎకనామిక్స్ అండ్ పాలసీ) రూపొందించిన ఒక అధ్యయన పత్రం.. కరోనా విషయంలో భారత్ మరెంత జాగ్రత్తతో ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసింది. మోడీ సర్కారు 21 రోజుల లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో.. ఈ అధ్యయనం బయటకు రావటం గమనార్హం.

కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ సరిగా అమలు జరగని పక్షంలో దేశానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదని చెబుతున్నారు. వైరస్ వ్యాప్తిని ఆపకుంటే.. భారత్ లో తీవ్ర పరిస్థితులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. రానున్న మూడునెలల్లో వైరస్ వ్యాప్తి ఇప్పుడున్నట్లుగా కొనసాగితే.. ఏకంగా 12 కోట్ల మంది వైరస్ బారిన పడే వీలుందని చెబుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించే విషయంలో దేశ ప్రజల్లో నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటే.. ముప్పు మరింత ఎక్కువ కావటమే కాదు..ఒకదశలో అది ఏకంగా 25 కోట్ల మందికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

సామాజిక దూరంతో పాటు.. వైరస్ వ్యాప్తిని నిరోధించే విషయంలో ఒక మోస్తరుగా అమలైన పక్షంలో కరోనా పాజిటివ్ కేసులు 18 కోట్ల వరకూ ఉండే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 694కు చేరుకోగా.. దీని కారణంగా మరణించిన వారి సంఖ్య పద్నాలుగుకు చేరుకుంది. కరోనా దెబ్బకు మొదటి దశలోనే భారీగా ప్రభావితమైన ఇటలీ.. అమెరికా ఉదంతాలతో భారత్ మేల్కొని ముందస్తు జాగ్రత్తల్ని తీసుకున్నట్లు చెప్పింది.

అయితే.. ఒక విషయంలో మాత్రం భారత్ భారీ తప్పు చేసినట్లుగా చెబుతున్నారు. భారత్ లోని ప్రజల్లో ఎంతమంది కరోనా బారిన పడ్డారన్న విషయాన్ని తేల్చటంలో ప్రభుత్వాలు విఫలమైనట్లుగా భావిస్తోంది. ప్రస్తుతానికి భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్యాపరంగా తక్కువగా ఉండొచ్చు కానీ.. వైరస్ లక్షణాలు కనిపించే లోపు.. సదరు బాధితుడి నుంచి ఎంతమందికి కరోనా వ్యాపిస్తుందో చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు.

వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అంచన వేయటం కష్టమని చెబుతున్నారు. భారత్ లో అమలు చేస్తున్న విధానాల్ని చూస్తే.. మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. వైరస్ వ్యాప్తి కట్టడిని నిలువరించకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. భారత్ లో వైద్య సేవలు స్వల్పమన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పెరిగే పాజిటివ్ కేసులతో పోల్చినప్పుడు అందుబాటులో ఉండే పడకలు తక్కువని గుర్తు చేస్తున్నారు.

వైరస్ వ్యాప్తి అనుకున్న రీతిలో కొనసాగితే.. రానున్న రోజుల్లో పది లక్షల వెంటిలేటర్లు అవసరమవుతాయని చెబుతున్నారు. ప్రస్తుం దేశంలో కేవలం 30వేల నుంచి 50 వేల మధ్య వరకు మాత్రమే వెంటిలేటర్లు అందుబాటులో ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడున్న గణాంకాల్ని చూసి మురిసిపోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండదంటున్నారు. ఎందుకంటే.. వైరస్ సోకిన వారు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో బయటకు వచ్చే అవకాశం ఉందని.. దాన్ని నిరోధించేందుకు ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరంగా చెబుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-