విజృంభిస్తున్న కరోనా.. సెలవులిచ్చేసిన టెక్ కంపెనీలు! ఏయే కంపెనీలంటే?

0

భయంకరమైన కరోనా వైరస్ చైనాలో ఇప్పటికే 132 మందిని బలి తీసుకుంది. దాదాపు 6,000 వేల మందిని బలి తీసుకుంది. దీంతో చైనాలో ఉన్న టెక్ దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు ఈ వైరస్ సోకకుండా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను చైనాకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరిన్ని కంపెనీలు చైనాలో ఉన్న తమ స్టోర్లను మూసివేస్తున్నాయి. యాపిల్, ఫేస్ బుక్, టిక్ టాక్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఏం చేస్తున్నాయో తెలుసా?

​ఇంటి దగ్గర నుంచే పని చేయండి!

ఫేస్ బుక్ ఇతర దేశాల్లో ఉన్న తమ ఉద్యోగులను చైనా వెళ్లకుండా నిషేధించింది. చైనాలోని తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ ఆఫర్ చేస్తుంది. అంటే చైనాలోని ఫేస్ బుక్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేయవచ్చన్న మాట!

​అలీబాబా కూడా!

చైనా దిగ్గజ కంపెనీ అలీబాబా కూడా తమ ఉద్యోగులను ఇంటి దగ్గర నుంచే పనిచేయాలని కోరింది. ఫిబ్రవరి 2వ తేదీతో చైనాలో లూనార్ న్యూ ఇయర్ బ్రేక్ ముగియనుంది. ఆ తర్వాత వారం రోజుల పాటు ఇంటి వద్ద నుంచే పని చేయాలని అలీబాబా తన ఉద్యోగులను కోరింది.

​ఏకంగా సెలవులు ఇచ్చేసిన టెన్ సెంట్!

టెన్ సెంట్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ పబ్ జీ గేమ్ ను సృష్టించిన కంపెనీ అంటే మాత్రం మనలో చాలా సులభంగా అర్థం అవుతుంది. ఈ కంపెనీ అయితే ఏకంగా ఫిబ్రవరి 9వ తేదీ వరకు సెలవులు ఇచ్చేసింది.

​యాపిల్ రూటే సపరేటు!

యాపిల్ ఈ విషయంలో అన్ని స్టోర్లకు ఒకేలా వ్యవహరించలేదు. చైనాలో ఉన్న ఒక రిటైల్ స్టోర్ ను మూసి వేసింది. మిగతా స్టోర్లలో పని గంటలను భారీగా తగ్గించింది. దీంతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తన ఉద్యోగులు చైనాకు ప్రయాణించకుండా నిషేధించింది.

​14 రోజులు ఇంటి దగ్గరే ఉండండి!

మనదేశంలో బాగా పాపులర్ అయిన టిక్ టాక్ యాజమాన్య సంస్థ బైట్ డ్యాన్స్ వినూత్న నిర్ణయం తీసుకుంది. సెలవుల్లో ఏదైనా టూర్లకు వెళ్లిన ఉద్యోగులు 14 రోజుల పాటు ఇంటి దగ్గరే ఉండి వైరస్ సోకిందో లేదో తెలుసుకోవాల్సిందిగా కోరింది. చైనాలో బాగా పాపులర్ అయిన ఈ-కామర్స్ సంస్థ పిన్ డ్యుయో డ్యుయో, యూబీఎస్ గ్రూప్ కూడా ఇదే విధంగా చేయాల్సిందిగా తమ ఉద్యోగులకు సూచించాయి.

​ఎల్జీ, శాంసంగ్ ఏం చేశాయంటే?

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్జీ కూడా ఇతర దేశాల్లో ఉన్న తమ ఉద్యోగులను చైనాకు ప్రయాణించకుండా నిషేధం విధించింది. దీంతో పాటు శాంసంగ్ కూడా హూబే ప్రావిన్స్ ను సందర్శించిన తమ ఉద్యోగులను ఏడు రోజులు ఇంటి దగ్గరే ఉండాల్సిందిగా కోరింది.

ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫాంలు ఇలా..

చైనాలోని అతి పెద్ద ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫాం అయిన సీట్రిప్ తన పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి రీఫండ్ ప్రకటించింది. దాదాపు 3 లక్షలకు పైగా హోటళ్లు రీఫండ్ ఇవ్వడానికి అంగీకరించాయని తెలిపింది. జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ మధ్య బుకింగ్ చేసుకున్న వారికి ఈ రీఫండ్ ను అందిస్తున్నారు. ఫ్లైట్ టిక్కెట్లు, క్రూజ్ లు, కార్ రెంటల్స్ పై ఈ తగ్గింపు వర్తించనుంది. దీంతో పాటు ఫ్లిగ్గీ, అలీబాబా బుకింగ్ సైట్లు కూడా తమ సైట్ల ద్వారా బుక్ చేసుకున్న వారికి రీఫండ్ అందిస్తున్నాయి.
Please Read Disclaimer