కేసీఆర్ ను ఇంత దారుణంగా ఎవరూ తిట్టలేదేమో?

0

ఒకేలాంటి తప్పులు చేసినా..కొన్నిసార్లు పెద్దగా వ్యతిరేకత రాని అంశం మీదా.. ఒక్కోసారి అందుకు భిన్నమైన పరిస్థితి ఎదురవుతుంటుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికి మించిన మెజార్టీని సొంతం చేసుకున్న కేసీఆర్.. తెలంగాణలో ప్రతిపక్షమే లేదన్నట్లుగా వ్యవహరించాలన్నట్లుగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించటం.. పలువురు నేతల్ని తమ పార్టీలోకి చేర్చుకోవటం తెలిసిందే.

ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతల్ని తమ పార్టీలో కలుపుకోవటం కేసీఆర్ కు కొత్తేం కాకున్నా.. ఎప్పుడూ లేనంత తీవ్రమైన వ్యతిరేకతను తాజాగా ఎదుర్కొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలిన కేసీఆర్.. తాను చెప్పిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చిన పరిస్థితి.

అప్పటి నుంచి పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడని ఆయన.. కొత్తగా పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలన్న తలంపులో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజకీయ వాతావరణం సరిగా లేదని తెలిసినా.. పన్నెండు మంది ఎమ్మెల్యేల్ని పార్టీలో విలీనం చేసిన ప్రక్రియ సంచలనంగా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ చర్య సరైనది కాదన్న మాట వినిపించినప్పటికి పట్టించుకోకుండా విలీన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

కేసీఆర్ అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ నేతలతో పాటు.. కమ్యునిస్ట్ నేతలు సైతం గళం విప్పుతూ.. విలీనంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ను తిట్టాలంటే రాజకీయ నేతలు ఇప్పటివరకూ తెర మీదకు తీసుకురాని విచిత్రమైన వ్యాఖ్యను సీపీఐ నారాయణ చేశారు.

ఫిరాయింపుల్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టిన కేసీఆర్ తీరును తప్పు పట్టిన నారాయణ.. జనాన్ని మోసం చేసిన వ్యక్తి.. కుటుంబ సభ్యుల్ని కూడా అమ్మటానికి వెనుకాడరంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. సుదీర్ఘకాలం పోరాటాలు చేసిన బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన నారాయణ.. కేసీఆర్ ను ఉద్దేశించి ఊహించని రీతిలో చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరింత ఘాటు వ్యాఖ్య చేసిన నారాయణను ఉద్దేశించి కేసీఆర్ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి.
Please Read Disclaimer