వైసీపీకి దగ్గుబాటి గుడ్బై.. ఫోన్లోనే తేల్చేశారు..

0

మాజీ మంత్రి వైసిపి నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆయన కుమారుడు చెంచురామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు దగ్గుబాటితో పాటు ఆయన కుమారుడు చెంచురామయ్య వైసిపి అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో దగ్గుబాటి తన వారసుడు చెంచు రామయ్యను పోటీ చేయించాలని అనుకున్నారు. అయితే చివరి వరకు చెంచురామయ్య అమెరికా పౌరసత్వ వివాదం ఎటూ తేలక పోవడంతో చివరకు వెంకటేశ్వరరావే పోటీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు.

ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గుబాటి మాత్రం పర్చూరు వైసిపి ఇన్చార్జ్గా కొనసాగుతూ వస్తున్నారు. అయితే భార్య కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి బిజెపి నేతగా ఉండడంతో పాటు జాతీయస్థాయిలో ఆ పార్టీ కీలక నేతగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె వైసీపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ భార్య భర్తలు ఇద్దరు ఏదో ఒక పార్టీలోనే ఉండాలని అల్టిమేటం జారీ చేయడంతో పురందేశ్వరి బీజేపీలో కొనసాగేందుకు వీలుగా వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు చెంచురామయ్య వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నియోజకవర్గంలోని తన ముఖ్య అనుచరులతో మీటింగ్ పెట్టిన ఆయన తన నిర్ణయాన్ని వారికి చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని దగ్గుబాటి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఫోన్ లో చెప్పినట్టు తెలుస్తోంది. తనతో పాటు తన కుమారుడు రామయ్య వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని అలాగే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లి తన ఓటమికి కారణమైన రావి రామనాథం బాబు తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలోనూ తమను సంప్రదించలేదని విజయసాయిరెడ్డికి చెప్పినట్టు సమాచారం. ఏదేమైనా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు చెంచురామయ్య వైసిపి రాజకీయ ప్రస్థానం ఐదు నెలల్లోనే ముగిసినట్లయింది.

ఇక జగన్ సైతం దగ్గుబాటి పార్టీ నుంచి బయటకు వెళ్తేనే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. దగ్గుబాటి వైసీపీని వీడడం దాదాపు ఖరారైన నేపథ్యంలో పర్చూరు వైసీపీ పగ్గాల కోసం రావి రామనాథం బాబుతో పాటు మరో మాజీ ఇన్చార్జ్ గొట్టిపాటి భరత్ రేసులో ఉన్నారు. అలాగే పర్చూరు మాజీ ఎంపీపీ కొల్లా వెంకట్రావుతో పాటు పర్చూరు కారంచేడు మండలాలకు చెందిన కొందరు ఎన్ఆర్ఐలు సైతం రంగంలో ఉన్నారు. మరి వీరిలో జగన్ ఎవరికి పర్చూరు వైసీపీ పగ్గాలు ఇస్తారో చూడాలి.




Please Read Disclaimer