హైడ్రామాకు తెర..పోలీసుల అదుపులో దాసరి కుమారుడు

0

కొద్దిరోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది. వారం రోజులుగా కనిపించకుండా పోయిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణ రావు కుమారుడు ప్రభు ఈరోజు (బుధవారం) హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు..? ఎవరైనా కిడ్నాప్ చేశారా..? ఆయనే స్వయంగా వెళ్లిపోయారా..? కనిపించకుండా వెళ్లిన ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు..? అనే విషయాలపై ఆయనను పోలీసులు విచారణ జరిపినట్లు తెలుస్తోంది.

దాసరి తారక ప్రభు కనిపించకుండా పోవడం సినీ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. రెండు మూడు రోజులైనా ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. దీంతో దాసరి ప్రభు అదృశ్యం వెనకాల ఆయన భార్య సుశీల – ఆమె తల్లి ఉన్నారేమోనని పోలీసులు అనుమానించారు. దాసరి కుటుంబంలో కొంత కాలంగా ఆస్తి వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తనకు న్యాయం చేయాలంటూ దాసరి సుశీల పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను కిడ్నాప్ చేశారని అంతా అనుకున్నారు.

అందుకే పోలీసులు ఓ బృందాన్ని సుశీల నివాసం ఉంటున్న చిత్తూరుకు పంపారు. అక్కడ పోలీసులకు ప్రభు ఆచూకీ లభ్యం కాలేదు. ఆయన భార్య సైతం తనకు ప్రభు ఎక్కడికి వెళ్లారో తెలియదని పోలీసులకు సమాధానం చెప్పారు. దీంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు హైదరాబాద్ లో ప్రత్యక్షమవ్వడంతో పోలీసులతో పాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాసరికి ప్రభుతో పాటు మరో కొడుకు అరుణ్ కుమార్ (చిన్నా సినిమా ఫేం) – కూతురు హేమలయ కుమారి ఉన్నారు.

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు కనిపించటం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రభు తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 2008లోనూ ప్రభు ఇలా అదృశ్యమయ్యారు. అప్పట్లో తిరిగి వచ్చిన ప్రభు తన భార్య సుశీల తనను కిడ్నాప్ చేసిందంటూ ఆరోపించారు. దాసరి మరణం తరువాత కుటుంబంలో నెలకొన్న వివాదాలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దాసరి ప్రభు అదృశ్యం కలకలం రేపిన విషయం తెలిసిందే.
Please Read Disclaimer