దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌

0

శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’ హత్యోదంతం కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఎన్‌కౌంటర్‌కు గల కారణాలు పోలీసులు గోప్యంగా ఉంచారు. గత నెల 27న హత్యాచారం చేసి ఆ తర్వాత కాల్చి చంపారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని, లేదా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దిశను కాల్చిన చోటే ఎన్‌కౌంటర్?

దిశను అత్యాచారం చేసి హత్య చేసిన చోటే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలుస్తోంది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపాం: పోలీసులు
హైదరాబాద్‌: దిశ హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా.. తమ వద్ద ఆయుధాలు తీసుకొని నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారని, ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు.

ఎన్‌కౌంటర్‌ స్థలాన్ని పరిశీలించిన సజ్జనార్

‘దిశ’ హత్యాచార కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన స్థలాన్ని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పరిశీలించారు.

ఆనందం వ్యక్తం చేసిన దిశ కుటుంబ సభ్యులు

దిశ హత్యకు కారణమైన నలుగురు నిందితులకు ఎన్‌కౌంటర్‌ చేసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.  ఇంత తొందరగా నిందితులను శిక్షించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.  అండగా నిలిచిన ప్రభుత్వానికి మీడియాకు, సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు.

దిశకు న్యాయం జరిగింది: ఎన్టీఆర్‌
దిశ హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ స్పందించారు. దిశకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన పోస్టు చేశారు.

ఎన్‌కౌంటర్‌ చేయడం సమర్థనీయమే: నారాయణ

 దిశ హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం సమర్థనీయమే అని సీపీఐ నేత నారాయణ అన్నారు. అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి శిక్షలు సమర్థనీయమే అని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌ను సీపీఐ సమర్థిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్‌
దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ను సీపీ సజ్జనార్‌ నిర్ధారించారు. ఈ తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ఆయన వెల్లడించారు. చటాన్‌పల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని సీపీ పరిశీలించారు.
Please Read Disclaimer