భారత్ పై ట్రంప్ అన్న మాట.. నవ్వి పోదురుగాక..

0

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయ్యింది.. పేదరికంలో ఉన్న భారత దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. మోడీ సార్ దయ వల్ల మళ్లీ ఆర్థిక మాంద్యం దాపురించి దేశం జీడీపీ 4శాతానికి పడిపోయి.. వేల పరిశ్రమలు మూతపడి.. వందల మంది ఉద్యోగాలు ఊడిపోయి.. రియల్ భూమ్ పడిపోయి.. ప్రజల చేతుల్లో చిల్లి గవ్వ కూడా నాట్యమాడని పరిస్థితిని దేశం చూస్తోంది. ఆర్థిక మాంద్యంతో పైసలు చెలామణీ లేక అన్ని కుదేలవుతున్న ఆర్థిక అత్యవసర పరిస్థితి చూస్తున్నాం. దేశంలో అసలు కార్మికులకు ప్రైవేటు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు కాని పరిస్థితి…

ఇన్ని దరిద్రాలు దేశంలో ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారత్ కు అదిరిపోయే షాకిచ్చారు.. ‘ఇక భారత్ అభివృద్ధి చెందిన దేశమే’ అని నొక్కి వక్కాణించారు. ఈ ప్రకటన చూసి మన మోడీసార్ ముసిముసి నవ్వులు నవ్వి ఉండవచ్చు కానీ దేశంలోని ప్రజలు మాత్రం మండిపడుతున్నారు.

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమైనా తెలివి తక్కువ మనిషా ఆ ప్రకటన చూసి ఆడిపోసుకోకండి.. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటిస్తే అమెరికా కు బోలెడు ప్రయోజనాలు.. అందుకే ట్రంప్ ఈ ఎత్తుగడ వేశాడు. భారత్ ను డెవలప్డ్ కంట్రీగా ప్రకటించి అమెరికా సుంకాన్ని విధించారు అదీ సంగతి..

తాజాగా భారత్ ను అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించమని.. భారత ఆర్థిక వ్యవస్థ డెవలప్డ్ ఎకానమీగా నిర్ధారించినట్టు ‘అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటీవ్స్ (యూఎస్టీఆర్)’ ప్రకటించింది. అంతేకాదు.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా అందించే ప్రయోజనాలను కట్ చేస్తున్నామని.. ఇక భారత్ కు అర్హత లేదని తేల్చిచెప్పింది. దీంతో ఇప్పటి వరకూ అమెరికా జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ) పథకం కింద ఇచ్చే రాయితీలు ప్రయోజనాలకు కోత పడనుంది.

ఈ పరిణామం భారతీయ ఎగుమతి దారులను నష్టాల్లో ముంచెత్తుతుంది. ఈ స్కీమ్ కింద భారత ఎగుమదిదారులు ఎలాంటి సుంకాలు చెల్లించకుండా అమెరికాకు ఎగుమతులు చేసుకునే సౌకర్యం ఉండేది. ఇప్పుడు ఈ ప్రయోజనాలు రద్దు అయితే భారత ఎగుమతిదారులకు ఇబ్బందులే. అమెరికా అందించే జీఎస్పీ ప్రయోజనాలకు గండి పడితే భారత్ ఎగుమతుల పై ఒత్తిడి పెరిగి మార్కెట్ వాటా తగ్గుతుందని దేశ పారిశ్రామికవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇలా ట్రంప్ భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించి అన్ని సౌకర్యాలు కట్ చేశారమన్న మాట.. అది తెలియని భారత రాజకీయ నేతలు కొందరు అల్ప సంతోషులు.. వెర్రి మాలోకాలు భారత్ డెవలప్డ్ కంట్రీ అని మురిసి పోతున్నారు.