సులేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట..అంతమంది మరణించారా?

0

ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభంగా భావిస్తున్న ఇరాన్ సైనిక చీఫ్ ఖాసీం సులేమానీ అంత్యక్రియల సందర్భంగా షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఇరాన్ అధికారిక టీవీ వెల్లడించిన సమాచారం విస్మయానికి గురి చేసేలా ఉంది. డ్రోన్ సాయంతో ఖాసీం సులేమానీని హతమార్చిన అమెరికా.. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ఉదంతంపై పలు దేశాలు తప్ప పట్టగా.. ఇరాన్.. ఇరాక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

ఈ హత్యకు బదులు తీర్చుకుంటామని ఆవేశంతో ఊగిపోయిన ఇరాన్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలకు ఖరీదు కట్టి పెను సంచలనానికి తెర తీసింది. ఇదిలా ఉంటే.. సులేమానీ అంత్యక్రియల్ని ఆయన స్వస్థలమైన కెర్మాన్ కు తీసుకొచ్చారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు లక్షలాది ప్రజలు పోటెత్తటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

ఈ ఘటనలో ఏకంగా 35 మంది మరణించినట్లు ఇరాన్ అధికారిక టీవీ చానల్ పేర్కొంది. మరో 48 మంది గాయపడినట్లుగా పేర్కొన్నారు. ఈ ఘటనను ఇరాన్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ హెడ్ పీర్ హోస్సేన్ కౌలివంద్ కూడా ధ్రువీకరించారు. సోమవారం సులేమానీ భౌతికకాయాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు తీసుకురాగా.. ఆ సందర్భంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు లక్షలాదిగా ప్రజలు ఎవరికి వారుగా వచ్చారు. టెహ్రాన్ లోని ఇస్లామిక్ రివల్యూషన్ కూడలి వద్దకు చేరుకున్న వారంతా నల్లటి వస్త్రాల్ని ధరించి వచ్చారు. సులేమానీ స్వస్థలంలోనూ ఇలాంటి పరిస్థితే. అయితే.. తొక్కిసలాటలో ఇంత పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
Please Read Disclaimer