కొత్త ఉద్రిక్తత.. చంద్రబాబు ఇంటి పైకి డ్రోన్ల ప్రయోగం

0

మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో అద్దెకు ఉండే ఇంటిపైకి డ్రోన్లు ఎగరటం సంచలనంగా మారింది. ప్రైవేటు వ్యక్తులు బాబు నివాసంపైకి డ్రోన్ కెమేరాల్ని ప్రయోగించటం కలకలం రేపుతోంది. తమ అధినేత ఇంటిపైకి డ్రోన్లు ఎగురవేస్తున్న ప్రైవేటు వ్యక్తుల్ని స్థానిక టీడీపీ నేతలు చూసి పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పజెప్పారు. ఇదిలా ఉంటే.. తాము జల వనరుల శాఖ అధికారుల అనుమతితోనే డ్రోన్లను ప్రయోగించినట్లుగా సదరు వ్యక్తులు చెబుతుండటం వివాదంగా మారింది.

మరోవైపు.. ఈ ఉదంతంపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జెడ్ ప్లస్ సెక్యురిటీ ఉన్న నాయకుడి ఇంటిపైకి డ్రోన్ కెమేరాలు ఎలా ఎగురవేస్తారని.. కోర్టు సైతం తాజాగా బాబు సెక్యురిటీ మీద అక్షింతలు వేసిందని.. ఇలాంటివేళ.. డ్రోన్ల ప్రయోగం వెనుక పోలీసుల హస్తం లేకుండా సాధ్యమా? అని ప్రశ్నిస్తున్నారు.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో చంద్రబాబు నివాసం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసుల తీరును వారు నిరసిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు.. టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు.. డ్రోన్ల వ్యవహారం గురించి సమాచారం అందుకున్న టీడీపీ నేతలు పలువురు బాబు నివాసానికి చేరుకున్నారు. పోలీసులు.. ప్రభుత్వ తీరును తప్ప పట్టారు. నిజాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఏపీ డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైసెక్యురిటీ జోన్లో డ్రోన్లు ఎలా ఎగురుతాయని ప్రశ్నించారు. డ్రోన్లు ఎగురవేసిన వ్యక్తులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? వారికి అనుమతి ఎవరిచ్చారు? అన్న ప్రశ్నలు సంధించగా డీజీపీ నుంచి సమాధానం రాలేదన్న మాట వినిపిస్తోంది.
Please Read Disclaimer