భద్రాద్రి శ్రీరాముడి పేరుతో దోచుకున్నారు

0

అందరినీ కాపాడే ఆ దేవుడికే రక్షణ లేకుండాపోయింది. తనను తాను కూడా శ్రీరాముడు కాపాడుకోలేకపోయాడు. దేవుడి పేరుతో దోపిడీకి పాల్పడ్డారు కొందరు మోసగాళ్లు. భద్రాద్రి రాముడి పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి పూజల పేరుతో డబ్బులు దండుకున్న వైనం అందరినీ షాక్ కు గురిచేసింది. ఓ భక్తుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం వెలుగుచూసింది.

వరంగల్ కు చెందిన విజయ్ కుమార్ భద్రాచలం రాములోరిని దర్శించుకుందామని ఆన్ లైన్ లో బుక్ చేసుకుందామని గూగుల్ లో వెతకగా.. భద్రాద్రి శ్రీరామాలయం పేరుతో ఓ వెబ్ సైట్ కనిపించింది. అదే నిజమైన ఆలయ వెబ్ సైట్ అనుకొని పూజల కోసం గూగుల్ పే ద్వారా రూ.500 ట్రాన్స్ ఫర్ చేశాడు. అయితే అది జనగామ జిల్లా పాలకుర్తి ఎస్బీహెచ్ కు డబ్బులు జమ అయినట్టు ఐఎఫ్ఎస్సీ కోడ్ ద్వారా ఆన్ లైన్ లో విజయ్ కు కనిపించింది. అనుమానం వచ్చి పాలకుర్తి పోలీసులకు సమాచారం అందించాడు.

మొబైల్ నంబర్ ఆధారంగా ఆ భద్రాద్రి వెబ్ సైట్ నడిపిస్తున్న యువకుడిని పట్టుకున్నారు. ఇతడు చాలా మందిని మోసం చేసినట్టు గుర్తించారు. భద్రాద్రి ఈవో గదరాజు నర్సింహులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చాలా మంది నుంచి ఈ మోసగాడు డబ్బులు భద్రాద్రి రాముడి పేరుతో దోచుకున్నాడని విచారణలో తేలింది.