Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఆ ప్రముఖుడి కారు ‘లెక్క’ తెలిస్తే ఫిదానే

ఆ ప్రముఖుడి కారు ‘లెక్క’ తెలిస్తే ఫిదానే


ప్రపంచ పారిశ్రామికవేత్తల్లో హాట్ టాపిక్ గా మారారు టెస్లా ఆటోమొబైల్ సీఈవో ఎలన్ మాస్క్. ప్రపంచ కుబేరుడిగా అవతరించిన ఆయన.. ఇప్పుడేం చేసినా సంచలనంగా మారుతోంది. ఇప్పటికే తన ఎలక్ట్రికల్ కార్లతో వాహన రంగాన్ని తనవైపు చూసేలా చేసిన ఆయన.. తాజాగా చేసిన ట్వీట్ మరింత వైరల్ గా మారింది. అత్యాధునిక ఎలక్ట్రికల్ కార్లను రూపొందిస్తున్న ఆయన.. తాను నడుపుతున్న కారు గురించిన వివరాల్ని వెల్లడించారు.

నాణ్యత.. అంతకు మించిన ఆధునికత..రెండింటికి ధీటుగా మైలేజీకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాయి టెస్లా కారు. చూసినంతనే సొంతం చేసుకోవాలన్నట్లుగా ఉండటంతో పాటు.. వాటి డిజైన్.. ఫీచర్లు తెగ టెంప్టు చేసేస్తుంటాయి. కరోనా కష్టాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ.. టెస్లా కార్ల గురించి చర్చ అంతకంతకూ పెరుగుతోంది. మహమ్మారి విరుచుకుపడిన వేళలో.. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొందో తెలిసిందే.

ఇప్పుడిప్పుడే మార్కెట్ జోరందుకుంటున్న వేళ.. టెస్లా సీఈవో ఎలన్.. తన కారు స్పీడ్ చూసి తాను చాలా గర్వపడుతున్నట్లుగా పేర్కొన్నారు. టెస్లా ఉత్పత్తి చేస్తున్న ఎస్ అండ్ ఎక్స్ తరహా కారు మార్కెట్లో డిమాండ్ ఉంది. తన ఎస్ మోడల్ కారు గురించి చెబుతూ.. కేవలం రెండు సెకన్ల వ్యవధిలో సున్నా నుంచి అరవై కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు.

అంతేకాదు.. కారు గంటకు 321 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని.. ఫుల్ గా చార్జి చేస్తే అది 627 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కారు ప్రత్యేకతల గురించి ఎలన్ ట్వీట్ చేసినంతనే విపరీతంగా వైరల్ కావటమే కాదు.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారు మోడల్స్ ను నెట్ లో చూస్తున్న వారంతా టెంప్టు అయిపోతున్న పరిస్థితి. ఇలాంటి కారును ఎవరు మాత్రం సొంతం చేసుకోవాలని అనుకోరు చెప్పండి.