తహసీల్దార్ విజయారెడ్డి హత్య.. నిందితుడి పరిస్థితి విషమం, ఎమ్మెల్యేపై ఆరోపణలు

0

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో సురేశ్ అనే వ్యక్తి తహసీల్దార్‌పై పెట్రోల్ పోసి నిప్పటించడంతో ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్‌.. ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన అనంతరం.. తను కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడని తెలుస్తోంది.

ఆఫీసు బయట పడిపోయి ఉన్న సురేశ్‌ను పోలీసులు హాస్పిటల్‌లో చేర్పించారు. అతడికి 60 శాతం కాలిన గాయాలయ్యాయి.. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విజయారెడ్డి భౌతిక కాయాన్ని ఆమె స్వగ్రామానికి తరలించారు.

ఎమ్మార్వో తన భూ రిజిస్ట్రేషన్ ఆలస్యం చేస్తుండటం వల్లే సురేశ్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అతడి కుటుంబ సభ్యులు మాత్రం ఇది నిజం కాదంటున్నారు. భూములకు సంబంధించిన వ్యవహారాలను అతడి తండ్రి చూసుకుంటున్నాడని, ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో ఉందన్నారు. సురేశ్‌కు ఇందులో సంబంధం లేదని ఆయనకు మతి స్థిమితం సరిగా లేదంటున్నారు.

సురేశ్ తహసీల్దార్‌ ఆఫీసుకు ఎందుకు వెళ్లాడో తమకు తెలియదని అతడి తండ్రి క్రిష్ణ తెలిపారు. ఎవరో కావాలని ఈ పని చేయించి ఉంటారని సురేష్‌ తల్లి పద్మ అనుమానం వ్యక్తం చేశారు. తహసీల్దార్ హత్యను తెలంగాణ సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్ ఖండించారు.

ఎమ్మెల్యేకు సంబంధం?
విజయారెడ్డి హత్య వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యేకు సంబంధం ఉండొచ్చని కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని విజయారెడ్డి చెప్పిందన్నారు. ఆమె కాల్ రిజిస్టర్‌ను చెక్ చేస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసు విచారణపై నమ్మకం లేదన్నారు.
Please Read Disclaimer