ఈమె వల్లే…ఫడ్నవీస్ సర్కారు కూలిపోయింది

0

మూడు రోజుల మురిపెం అనే మాటను నిజం చేస్తూ…మూడు రోజుల్లోనే మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం కథ ముగిసిపోయింది. ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. తనతో పాటు వచ్చిన 32 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలికవర్గం నేత అజిత్ పవార్…కీలక సమయంలో హ్యాండిచ్చి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసిన నేపథ్యంలో…ఫడ్నవీస్ పదవికి బైబై చెప్పేశారు. అయితే ఫడ్నవీస్ సర్కారు పడిపోవడం వెనుక ఓ మహిళ ముఖ్యపాత్ర పోషించిందని అంటున్నారు. ఆమె ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సతీమణి ప్రతిభ.

నాటకీయ పక్కీలో శనివారం ఉదయం 5.47 గంటలకు సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్‌లతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యరీ ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే. బల నిరూపణకు నవంబరు 30 వరకు గవర్నర్ సమయం ఇచ్చారు. అయితే అజిత్ పవార్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లారంటూ ఆయనను శాసనసభాపక్ష నేత పదవి నుంచి ఎన్సీపీ తొలగించింది. అనంతరం బీజేపీకి బలం లేకపోయినా ప్రమాణస్వీకారం చేయించారని వెంటనే బల నిరూపణకు ఆదేశించాలని మూడు పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం బుధవారమే బల నిరూపణకు ఆదేశించింది.ఈ సమయంలోనే అజిత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు.

అయితే ప్రభుత్వం ఏర్పాటులో భాగమైన అజిత్ అదే ప్రభుత్వం కొనసాగాల్సిన కీలక సమయంలో రాజీనామా చేయడం వెనుక ఏం జరిగిందో తెలుసా? ఇటు పార్టీ అటు పవార్ కుటుంబ సభ్యుల ఒత్తిడి. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని అజిత్ పవార్‌పై ఎన్సీపీ నేతలు ఒత్తిడి తీసుకువచ్చారు. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల ద్వారా అజిత్ పవార్‌పై శరద్ పవార్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్దిసేపటి తర్వాత అజిత్ పవార్‌తో శరద్ పవార్ భార్య ప్రతిభ మంతనాలు జరిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీలోకి తీసుకునేందుకు వీలుగా ఎన్సీపీ నుంచి శరద్ పవార్ సస్పెండ్ చేయలేదని కలిసి పనిచేసుకునేందుకు బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకోవాలని ఆమె సూచించినట్లు తెలుస్తోంది. సొంత చిన్నమ్మ చర్చలతో అజిత్ పవార్ మనసు మార్చుకున్నట్టుగా చెబుతున్నారు. దీంతో బలపరీక్షకు ముందే ఫడ్నవిస్ అజిత్ పవార్ తమ పదవులకు రాజీనామా చేశారు.
Please Read Disclaimer