రోజా రూట్ మారిపోనుందా? కీలక నిర్ణయాలు తీసుకున్న ఫైర్ బ్రాండ్

0

ఏపీ అధికారపక్షంలో ఫైర్ బ్రాండ్ గా మాత్రమే కాదు.. నటిగా.. బుల్లితెర వ్యాఖ్యాతగా తన టాలెంట్ ను ఇప్పటికే పలుమార్లు ప్రదర్శించుకున్న నటి కమ్ రాజకీయ నేత ఆర్కే రోజా. ప్రస్తుతం బుల్లితెర మీద పలు షోలు చేయటమే కాదు.. ఏపీఐఐసీ ఛైర్మన్ గా కీలక బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ మూడు టీవీషోలు.. ఆరు రాజకీయ నిర్ణయాలు అన్నట్లుగా వ్యవహరించిన ఆమె.. రానున్న రోజుల్లో తన రూట్ మొత్తం మార్చేయనున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకూ అమలు చేస్తున్న రోజువారీ కార్యకలాపాల్ని పూర్తిగా మార్చేయాలని.. కొత్త నిర్ణయాల్ని ఎడాపెడా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ రాజకీయాల్లో అంత యాక్టివ్ గా తన రోల్ లేదన్న ఆలోచనలో ఉన్న రోజా.. నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించటంలోనూ వెనుకబడిన మాట పలువురి నోట వినిపిస్తోంది. దీంతో.. తనను తాను సరికొత్తగా మేకోవర్ చేసే దిశగా పలు నిర్ణయాల్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఒక ఆఫీసును ఏర్పాటు చేయటమే కాదు.. దానికి ఒక బాధ్యుడ్ని పెట్టాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజలు తమకు ఏదైనా సమస్య వస్తే.. ఈ ఆఫీసుకు వచ్చి చెప్పుకుంటే సరిపోతుందంటున్నారు. అదే సమయంలో ఎపీఐఐసీ ఛైర్మన్ గా ఉన్నప్పటికీ.. ఆ పదవిని చేపట్టిన తర్వాత కూడా తన మార్కు ఇంకా పడలేదన్న ఆలోచనలో రోజా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే.. ఇకపై మరింత సమయాన్ని ఏపీఐఐసీ మీద పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా తాను పాల్గొనే టీవీ షోలకు సంబంధించిన షూటింగ్ లకు వారంలో ఒక్కరోజు మాత్రమే హాజరు కావాలని నిర్ణయించారు. అది మినహా మిగిలిన సమయమంతా రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్న యోచనలో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతకాలం తట్టని ఈ ఆలోచన ఇప్పుడే ఎందుకు తట్టిందన్నది ఒక ప్రశ్నగా మారింది. ఏమైనా ఇప్పటి వరకూ చూసిన రోజాకు.. ఇకపై చూసే రోజాకు సంబంధం ఉండదన్న మాట బలంగా వినిపిస్తోంది. తన తీరులో ఎంత తేడాను చూపిస్తారో చూడాలి మరి.
Please Read Disclaimer