సహజీవనంలో కూతురు..సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ నేత

0

గత కొద్దికాలంగా కొన్ని వివాహాలు…రకరకాల కారణాలతో వివాదాస్పదంగా మారుతున్న సంగతి తెలిసిందే. అమ్మాయిలు ఇతర మతస్తులను పెళ్లి చేసుకోవడం ఇందులో ప్రధానంగా పేర్కొనవచ్చు. ఒక మతానికి చెందిన వారు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడాన్ని `లవ్ జిహాద్`గా పలువురు పేర్కొంటున్నారు. ఈ ఒరవడిపై మాజీ ఎమ్మెల్యే – బీజేపీ నేత ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నారని – ఆయన కారణంగానే తన కూతురు ఇతర మతస్తుడిని పెళ్లిచేసుకుంటానని అంటోందని బాధితురాలిగా మారిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్ ఆరోపించారు. మతమార్పిడి ప్రేమలకు హుక్కా కేంద్రాలు నిలయంగా మారుతున్నాయని మండిపడ్డారు. అయితే – సింగ్ పై ఆయన కూతురు ఆరోపణలు చేయడం గమనార్హం.

సంచలనం సృష్టిస్తున్న ఈ ప్రేమ వ్యవహారం వివరాల్లోకి వెళితే….మధ్యప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్ తన కూతురు భారతీసింగ్ తప్పిపోయిందంటూ అక్టోబర్ 16న పోలీసులను ఆశ్రయించారు. మానసిక రుగ్మతతో తన కూతురు బాధపడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే భారతీసింగ్ హైకోర్టును ఆశ్రయించి ఊహించని వివరణ ఇచ్చారు. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకనే అజ్ఞాతంలోకి వెళ్లానని తన న్యాయవాది ద్వారా వివరించారు. దీంతోపాటుగా సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసి..బలవంతంగా ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని పేర్కొన్నారు. “నేను ఏ ముస్లింతోనో – క్రిష్టియన్ తోనో పారిపోలేదు. ఒక్కదానినే బయటకు వచ్చాను. నేను క్షేమంగా – సంతోషంగా ఉన్నాను. నాకు ఆ పెళ్లి ఇష్టంలేదు. కుటుంబ సభ్యుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించమని ధర్మాసనాన్ని వేడుకుంటున్నాను“ అని కోరారు. భారతీ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ…“ఆమె వేరే మతం వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఆమెను వేధించడం మొదలు పెట్టారు. బలవంతంగా వివాహం చేయాలని చూస్తున్నారు“ అని తెలిపారు.

తన కూతురు ప్రేమ ఇతరత్రా అంశాలపై సురేంద్ర సింగ్ తాజాగా స్పందిస్తూ..“ఐదేళ్లుగా నా కూతురు డిప్రెషన్ తో బాధ పడుతోంది. అందుకు చికిత్స చేయిస్తున్నాం కూడా. మానసికంగా కుంగిపోయిన తనతో కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే అసత్య ఆరోపణలు చేయిస్తున్నారు. దేవుడిని విశ్వసిస్తూ.. సంస్కృతీ సంప్రదాయాలు పాటించే వ్యక్తికే తన కూతురును ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తున్నాను. “ అని తెలిపారు. భోపాల్ లో హుక్కా సెంటర్లు ఎందుకు ఉన్నాయని సురేంద్రసింగ్ ప్రశ్నించారు. “పిల్లలు హుక్కా లాంజ్ లకు ఎందుకు వెళ్తున్నారు. వారికి హుక్కా తాగాల్సిన అవసరం ఏమిటి? హుక్కా లాంజ్ లు కేంద్రంగా లవ్ జిహాద్ ను వ్యాప్తి చేస్తున్నారు. ఆరిఫ్ కు వీటితో సంబంధం ఉంది. ఇలాంటి హుక్కా సెంటర్ల వల్లే నా కూతురు లవ్ జిహాద్ బాధితురాలిగా మారింది. భోపాల్ లో ఉన్న హుక్కా లాంజ్ యజమానులు వెంటనే వాటిని మూసివేయాలి. ఉంటే సహించేది లేదు` అని తేల్చిచెప్పారు. భోపాల్ లో లవ్ జిహాద్ పరంపర మత యుద్ధాలు చేయడానికి కూడా తాము వెనుకడుగువేయబోమని హెచ్చరించారు.
Please Read Disclaimer