‘దిశ’ కు న్యాయం జరిగింది.. జనం హర్షాతిరేకాలు

0

నిశిరాత్రిలో ఎక్కడైతే ‘దిశ’ కాలిపోయిందో.. ఆమె ఆర్తనాదాలు నిశీధిలో ఘోషగా మారాయో.. ఆమె ఆత్మ శరీరాన్ని విడిచి మనోవేధనతో ఎక్కడైతే వెడలిపోయిందో.. అక్కడే ఆ చంపిన నలుగురు నిందితులు గాలిలో కలిసిపోయారు. 10 రోజుల ‘దిశ’ హత్యోదంతంలో ప్రజలు కోరుకున్నదే జరిగింది.. మహిళలు నినదించిందే చోటుచేసుకుంది. పోలీసుల నిర్లక్ష్యంపై రాళ్లేసిన ప్రజలే ఇప్పుడు వారి చర్యపై పూలు జల్లుతున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘దిశ’కు న్యాయం జరిగిందని ప్రజలు సినీ రాజకీయ మేధావులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లో దారుణ అత్యాచారం హత్యకు గురైన ‘దిశ’కు ఎట్టకేలకు న్యాయం జరిగిందని ప్రజలు సినీ రాజకీయ దేశ ప్రముఖులందరినీ నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిశను మృగాళ్లలాగా రేప్ చేసి చంపిన నలుగురు నిందితులును ఎక్కడైతే దిశను కాల్చేశారో అక్కడే పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. హైదరాబాద్ లో నలుగురు నిందితులను ఈ తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. విచారణలో భాగంగా నిందితులను ‘దిశ’ను కాల్చిన చోటుకు తీసుకెళ్లగా.. అక్కడ సీన్ కన్ స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోవడానికి ప్రయత్నించడం.. రాళ్లు రువ్వడం.. పోలీసులపై తిరగబడడంతో ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ వార్త విని దేశవ్యాప్తంగా ప్రజలు ముఖ్యంగా మహిళా లోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ‘దిశ’కు సరైన న్యాయం జరిగిందని కొనియాడుతున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ పోలీసులు చేసిన పనిని కరెక్ట్ అంటూ మీడియాల ఎదుట చెబుతున్నారు.

ఢిల్లీలో ఏడేళ్ల కిందట నిర్భయను మృగాళ్లు అతి దారుణంగా రేప్ చేసి ఆమె చావుకు కారణమయ్యారు. వారికి ఉరిశిక్ష పడాలని నిర్భయ తల్లి శాంతదేవి ఇప్పటికీ కోర్టుల చుట్టూ.. ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. హైదరాబాద్ లో దిశ హత్యాచారంపై కూడా ఆమె సీరియస్ గా స్పందించారు. తాజాగా నిర్భయ తల్లి జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ పోలీసులు చేసిన పని నూటికి నూరు పాళ్లు కరెక్ట్. ఏడేళ్లుగా నా కూతురును దారుణంగా చంపిన వారికి ఉరిశిక్ష పడాలని ఎన్నో సంవత్సరాలుగా కోర్టులు పోలీసులు రోడ్ల మీద తిరిగాను. ఇప్పటికీ న్యాయం జరగలేదు. కేవలం 9 రోజుల్లోనే తెలంగాణ పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చేసి న్యాయం చేశారు.. హ్యాట్సాప్ టు హైదరాబాద్ పోలీస్’ అని చెప్పుకొచ్చారు.

తెలంగాణ పోలీసుల చర్యపై ఇప్పుడు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిశ కేసులో నిర్లక్ష్యం వహించారని దేశవ్యాప్తంగా అందరూ పోలీసులను తిట్టిపోశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరును ఎండగట్టారు. శంషాబాద్ పీఎస్ ను ముట్టడించారు. నిందితుల తరలిస్తున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. జాతీయ మీడియాలో తెలంగాణ సీఎం పోలీసులను కడిగేశారు. ఇప్పుడు తిట్టిన నోటితోనే కేసీఆర్ సర్కారు పోలీసుల చర్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. రాళ్లేసిన చోటు పూల వర్షం కురిపిస్తున్నారు.

‘దిశ’ తండ్రి చెల్లి కూడా తమకు న్యాయం జరిగిందని మీడియాకు తెలిపారు. తమ బిడ్డ రాదని తెలిసినా ఆ నలుగురు నిందితులను చంపడం మాత్రం తమకు ఉపశమనం కలిగిందని తెలిపారు. తాము పోలీసులను కేసీఆర్ ను తిట్టామని.. కానీ వారు చేసిన పనికి ఇప్పుడు అభినందిస్తున్నామని వారు తెలుపడం గమనార్హం.

ఉవ్వెత్తిన ఎగిసిన ఈ హత్యాచారంపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ర్యాలీలు క్యాండీల్స్ తో దిశ ఆత్మకు శాంతి చేకూరాలని నినదించారు. ఎట్టకేలకు ‘దిశ’కు న్యాయం జరిగింది. ఈ విషయంలో తమను తిట్టిన వారితోనే ప్రశంసలు కురిపించుకున్నారు తెలంగాణ పోలీసులు సీఎం కేసీఆర్. న్యాయాన్యాయాల విచక్షణ పక్కనపెడితే సత్వర న్యాయం దిశ కుటుంబానికి దక్కిందని జనాలు ఆ కుటుంబం చెబుతోంది. కేసీఆర్ తెలంగాణ పోలీసులకు జైజైలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయం చేసిన పోలీసులు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ‘తుపాకీ.కామ్’ తరుఫున మేం కూడా అభినందనలు తెలుపుతున్నాం. ఒక కేసు తేలడానికి సంవత్సరాలు గడిచే న్యాయవ్యవస్థలో ఇలాంటి కఠిన నిర్ణయం మృగాళ్లు కామపిశాచిలకు ఒక సరైన పాఠంలా ఇది నిలుస్తుందని ఆశిద్ధాం. సత్వర న్యాయం ఎండమావి అయిన దేశంలో ఇలాంటి ఒక ఘటన సభ్య సమాజానికి ‘దిశా’నిర్ధేశం చేస్తుందని తుపాకీ.కామ్ ప్రజల అభిమతం ప్రకారం సవినయంగా చెబుతోంది.

ఇక సినీ రాజకీయ ప్రముఖులు కూడా దిశ హంతకులను చంపడంపై స్పందించారు.

*టాలీవుడ్ హీరో ఎన్టీఆర్.. ‘న్యాయం జరిగింది.. దిశ ఆత్మకు శాంతి కలిగింది’ అని ట్వీట్ చేశారు.

* సినీ హీరో అల్లు అర్జున్ ‘న్యాయం జరిగింది’ అంటూ దిశను చంపిన నలుగురి నిందితుల వ్యవహారానికి సపోర్ట్ చేశారు.

*హీరో మంచు మనోజ్ దిశ హంతకులను చంపిన పోలీసుల కాళ్లు మొక్కుతానని ట్వీట్ చేశారు.
*హీరోయిన్ హన్సిక న్యాయం జరిగిందని ట్వీట్ చేసింది.

*చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు దిశ హంతకుల ఎన్ కౌంటర్ పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

* దిశ హంతకుల ఎన్ కౌంటర్ పై హీరో నాని స్పందించాడు.. ‘ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడుపోలీస్ అయ్యిండాలి’ దిశకు న్యాయం జరిగిందని హీరో నాని ట్వీట్ చేశాడు.

హీరో నాగార్జున దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు. ‘‘ఈరోజు ఉదయాన్నే ఒక వార్తతో నిద్రలేచాను.. అది దిశకు న్యాయం జరిగిందని తెలిసింది. ఎన్ కౌంటర్ లో నిందితుల మరణంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరింది.’’ అని నాగార్జున ట్వీట్ లో పేర్కొన్నారు..

దిశ ఎన్ కౌంటర్ పై హీరోయిన్ సమంత ట్విట్టర్ లో స్పందించింది.. ‘ఐలవ్ తెలంగాణ. భయం ఓ గొప్ప పరిష్కారం.. కొన్నిసార్లు అదొక్కటే సరైన నిర్ణయం’
Please Read Disclaimer