ఫిర్యాదుపై పట్టించుకోని పోలీసులు.. హైకోర్టుకు గన్నవరం ఎమ్మెల్యే వంశీ

0

సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, బెదిరింపులకు పాల్పడతున్నారని పేర్కొంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పటి వరకు పోలీసులు దీనిపై కేసు నమోదుచేయలేదని వంశీ ఆరోపించారు. ఈ అంశంపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని…కేసు నమోదు చేసేలా ఆదేశించాలని ఎమ్మెల్యే వంశీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ స్వీకరించిన హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఇప్పటి వరకూ వంశీ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆయన తరఫు లాయర్ వాదించారు. వంశీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

కాగా, ఇటీవల వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తనను, తన క్యాడర్‌ను వైఎస్సార్సీపీ నేతలు, ప్రభుత్వ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. తనను నమ్ముకున్న వారిని కాపాడుకునేందుకే పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

ప్రభుత్వం వేధింపులను పార్టీ పరంగా ఎదుర్కొందామని అన్నారు. ఎప్పుడు అన్యాయం జరిగినా తలదించుకోకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం మన బాధ్యతని, ఈ అంశంలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్‌సీపీ వేధింపులను, మీకు జరిగిన అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని, దీనిని ప్రజల్లోకి తీసుకెళదామని అన్నారు. వంశీతో చర్చలు జరపడానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను దూతలుగా బాబు పంపారు. వారితో భేటీ అయిన తర్వాత వంశీ సందిగ్ధంలో పడ్డారు. కొద్దిరోజులు సైలెంట్‌గా ఉండిపోయిన వంశీ.. తిరిగి యాక్టివ్ అయ్యారు.