మ్యూజియంలో దొంగతనం.. పక్కా స్కెచ్‌తో రూ.7100 కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ

0

జర్మనీలోని డ్రెస్డెన్‌ నగరంలో భారీ చోరీ చోటు చేసుకుంది. డ్రెస్డన్ గ్రీన్ వాల్ట్ మ్యూజియంలోని.. వెలకట్టలేని వజ్రాలు పొదిగిన మూడు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రపంచంలోని పురాతన మ్యూజియంలలో ఒకటిగా పేరొందిన డ్రెస్డన్ గ్రీన్ వాల్ట్‌లో సోమవారం జరిగిన ఈ దొంగతనం యూరప్ వ్యాప్తంగా సంచలనమైంది. దొంగలు ఎత్తుకెళ్లినవి 18వ శతాబ్దానికి చెందిన అరుదైన ఆభరణాలు కావడం గమనార్హం.

వెలకట్టలేని అమూల్య సంపద

చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.7 వేల కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని జర్మన్ మీడియా చెబుతోంది. దొంగతనానికి గురైన ఆభరణాలను వెలకట్టడం సాధ్యం కాదని డ్రెస్డెన్స్ స్టేట్ ఆర్ట్ కలెక్షన్స్ డైరెక్టర్ మారియన్ అక్రెమన్ తెలిపారు. ఆభరణాలను ముక్కలు చేయొద్దొని ఆమె దొంగలకు పిలుపునిచ్చారు. 1723లో ఆగస్టస్ ది స్ట్రాంగ్ ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. దీనికున్న గ్రీన్ పెయింట్ వల్ల ఈ మ్యూజియానికి గ్రీన్ వాల్ట్‌ అనే పేరొచ్చింది.

భద్రతా సిబ్బంది వచ్చేలోపే..
భద్రతా సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలికి చేరుకున్నప్పటికీ.. దొంగలు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారు. దీంతో దొంగల వేట కోసం పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. చోరీకి పాల్పడిన వారు ఎక్కడికీ పారిపోకుండా వాహనాలను ఆపి తనిఖీలు చేపడుతున్నారు.

దొంగతనం జరిగిందిలా..
సోమవారం వేకువజామున మ్యూజియంలోని ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సమీపంలో దొంగలు నిప్పు అంటించారు. తర్వాత మ్యూజియం అలారంను ఆపేశారు. పవర్ ఆగిపోవడంతో.. మ్యూజియం మొత్తం అంధకారం అలుముకుంది. పవర్ కట్ అయినప్పటికీ.. నిఘా కెమెరాలో చోరీ ఘటన రికార్డయ్యింది. డ్రెస్డన్ రాయల్ ప్యాలెస్‌లోని గ్రీన్ వాల్ట్‌లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు ఆభరణాలను ఉంచిన విండోను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు.
Please Read Disclaimer