మత ఆచారాలకు ప్రభుత్వ డబ్బులా?

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మసీదులలో ఇమామ్ లు, మౌజం లు అలాగే చర్చిల్లో పాస్టర్లు గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు దేవాలయాల్లో పూజారులకు కూడా ఆర్ధిక సాయాన్ని పెంచింది. దీనిపై ప్రచారమాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. ఇది దేవాలయాల్లో అర్చకులకు పెంచినప్పుడు అంతగా జరిగినట్లు లేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం పై వస్తున్న ‘క్రిస్టియన్ మతానుకూల విధానాల’ ఆరోపణలకు ఇది జతకూడింది. ముఖ్యంగా జేరూసలెం , హాజ్ యాత్రల ఆర్ధిక సాయం పెంపుపై విమర్శల దాడి ఎక్కువయ్యింది. ఇది పూర్తిగా జగన్ వ్యతిరేక ప్రచారంగా కొట్టిపారవేయలేము. అసలు దీనిపై ప్రభుత్వ విధానం ( అది జగన్, చంద్రబాబు, కెసిఆర్, మోడీలతో సంబంధం లేకుండా) ఎలావుండాలనేదానిపై చర్చ జరగాల్సివుంది.

భారత రాజ్యాంగం దీనిపై నిర్దిష్ట అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అదేసమయంలో మత ఆచారాలలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛను కల్పించింది. జవహర్ లాల్ నెహ్రూ వున్నంతవరకు పెద్దగా మత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం లేదనే చెప్పాలి. అయితే తను ఆచరణలో అన్ని మతాలతో సమతుల్యత పాటించలేదనే ఆరోపణలు వున్నాయి. ప్రభుత్వం, మతం మధ్య వున్న సున్నితమైన సంబంధం రాను రాను చిరిగిపోయి ప్రభుత్వమే మత వ్యవహారాల్లో జోక్యంచేసుకోవటం , ఆర్ధిక సాయం చేయటం లాంటి చర్యలు ఇటీవలికాలంలో ఎక్కువయ్యాయి. ప్రభుత్వానికి ఏ మతం లేదని, మన రాజ్యాంగం సెక్యులర్ కాబట్టి అన్ని మతాలకు పూర్తి స్వేచ్చని ప్రసాదించిందని అందరికీ తెలుసు. మొట్టమొదటి ప్రజాస్వామ్యదేశమైన అమెరికాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో మత ప్రార్థనలు వుండవు. అయితే మన సెక్యులరిజం కి ప్రాశ్చాత్య సెక్యులరిజం కి తేడా ఉందని మన మేధావులు విశ్లేషించారు. ఓకే, దాన్ని కొంతమేర సమర్ధించుకుందామనుకున్నా ఇటీవల అది శృతిమించి ప్రజల పన్నుల ఆదాయాన్ని విచ్చలవిడిగా మత ఆచారాలకు ఖర్చు పెట్టటం దాకా వెళ్ళింది.

అందులోనూ మత వివక్ష ఉందని మెజారిటీ మతస్తులైన హిందువులు భావిస్తున్నారు. సెక్యులరిజం పేరుతో మైనారిటీలను బుజ్జగించటం ఎక్కువైందని ఆరోపిస్తున్నారు. ఇది ఒక విధంగా హిందుత్వ వాదనలకు బలం చేకూరుస్తుంది. అంటే హిందుత్వ పార్టీ అయిన బీజేపీ బలపడటానికి పరోక్షంగా లౌకికవాదులుగా చెప్పబడే పార్టీల మైనారిటీ బుజ్జగింపు విధానాలే కారణమని చెప్పాలి. ఉదాహరణకు హిందూ స్వామీజీలు మా దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనమేంటన్న విమర్శ ప్రజల్లో మెల్లి మెల్లిగా నాటుకుంటుంది. దానికి కారణం లేకపోలేదు. ముస్లిం మసీదులు , క్రిస్టియన్ చర్చిల కు పూర్తి స్వేచ్ఛ వున్నప్పుడు హిందూ దేవాలయాలకు స్వేచ్ఛ ఎందుకు వుండకూడనేది వారి వాదన. అమెరికా, యూరప్ లలో మత సంస్థలేవి ప్రభుత్వ అధీనంలో వుండవు. అలాగే చైనా లాంటి కమ్యూనిస్టు దేశాల్లో ప్రభుత్వ సంస్థలన్నీ పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో ఉండటమే కాకుండా వాటి ఆచార వ్యవహారాల్లోనూ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. కానీ మన దేశంలో ఈ రెండు విధానాలకు విరుద్ధంగా హిందూయేతర మత వ్యవహారాలు పూర్తిగా మత సంస్థల చేతుల్లోనూ , హిందూ దేవాలయాలు పెద్దమొత్తంలో ప్రభుత్వ ఆధ్వర్యం లోనూ నడుస్తున్నాయి. ఇది ఓ విధంగా మత వివక్షే. లౌకికవాదులకు ఇది పెద్ద తప్పుగా కనిపించకపోవడం ఆశ్ఛర్యంగా వుంది. ప్రభుత్వమనేది అన్ని మతాలను సమ దృష్టితో చూడగలగాలి. ఈ మాట అంటే వెంటనే హిందూ మత అనుకూలుడుగా , మైనారిటీ వ్యతిరేక వైఖరిగా ఓ బ్రాండ్ తగిలించటం పరిపాటి అయ్యింది. మనదేశం అటు ప్రాశ్చాత్య ప్రజాస్వామ్య వైఖరికి, ఇటు కమ్యూనిస్టు ప్రభుత్వాల వైఖరికి భిన్నంగా మధ్యే మార్గం తీసుకోవటం ఉత్తమం. ఇంత జనాభా కలిగిన దేశంలో ఎన్నో లక్షల దేవాలయాలు వున్న దేశంలో ప్రభుత్వం పూర్తిగా వైదొలగటం పరిష్కారం కాదు. మిగతా మత ఆరాధనా ప్రదేశాలను కూడా ప్రభుత్వ నియంత్రణ కిందకు తీసుకు రావటం ఒక్కటే పరిష్కారం. అదే సమయంలో దేవాలయమైనా , మసీదైనా , చర్చయినా,బౌద్ధరామమైన వారి మతాచారాల్లో సాధ్యమైనవరకు ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. స్థూలంగా ఈ విధానాన్ని పాటించి అన్నింటికీ వాళ్ళ వాళ్ళ మతస్థులతో ట్రస్టీ బోర్డులు ఏర్పాటుచేయడం ఉత్తమం.

ఇకపోతే ఆర్ధిక విషయాలలో ప్రభుత్వం ఈ ట్రస్టీలు/ బోర్డులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం మంచిది. వాటికొచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలనే స్వేచ్ఛ పూర్తిగా వాటికే ఉండాలి. ప్రభుత్వం ఆ డబ్బులను ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోరాదు. అదే సమయంలో పన్నుదారుల ప్రభుత్వ డబ్బుల్ని దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు, ఇతర మత ఆలయాలకు ఎటువంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టకూడదు. తెలంగాణ ప్రభుత్వం యాదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవాలయాన్ని పునర్నిర్మించటం కోసం వందలకోట్ల ప్రభుత్వ ఖజానాన్ని ఖర్చుపెట్టటం ఎంతవరకు సబబు? ఓ ట్రస్టు ద్వారా విరాళాలకు పిలుపు ఇచ్చివుంటే దాతలు పోటీ పడేవాళ్ళు కాదా? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచటమే. కెసిఆర్ కి దేవాలయాన్ని పునర్నిర్మించాలని ఉంటే అది తన ఇష్టం. కానీ ప్రభుత్వ ధనాన్ని ఖర్చుపెట్టే హక్కు తనకెక్కడిది? ఇదే జగన్ మోహన్ రెడ్డి కి వర్తిస్తుంది. జరుసలేం , హాజ్ యాత్రలకు ప్రభుత్వ డబ్బుల్ని ఖర్చు పెట్టే హక్కు తనకెవరిచ్చారు? రేపు హిందువులు కాశీ యాత్రకు, అయోధ్య యాత్రకు డబ్బులివ్వమని అడిగితే ఎలా కాదంటారు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కు కూడా ఇదే వర్తిస్తుంది. ప్రభుత్వ పాలకులు పార్టీలతో సంబంధం లేకుండా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మతాచారాలకు అది ఏ మతమైనా ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ధనాన్ని వినియోగించకూడదు.

దురదృష్టమేమంటే లౌకికవాదం పేరుతో అలౌకిక , అవకాశవాద రాజకీయాలు చేయటంతో లౌకిక సిద్ధాంతం మన దేశంలో ప్రమాదంలో పడింది. ఎవరు లౌకిక వాదులో , ఎవరు సంప్రదాయవాదులో అర్ధం కాని పరిస్థితి. అభ్యుదయం పేరుతో చలామణి అవుతూ వుమ్మడి పౌర స్మృతి ని వ్యతిరేకించటం, ముమ్మూరు తలాక్ ని వ్యతిరేకించటం ఆశ్చర్యం. ఎవరు అభ్యుదయ వాదులో , ఎవరు యధాతథ వాదులో అర్ధంకాని పరిస్థితి. అలాగే హిందూ సంప్రదాయాలను వ్యతిరేకించటం, ఇతర మత సంప్రదాయాలను గౌరవించటం లౌకిక వాదానికి కొత్త నిర్వచనం. ఎప్పటికైనా రాజకీయాలను పక్కనపెట్టి సామాజిక విషయాల్లో దేశం మొత్తం ఒక్కటవుతుందని ఆశిద్దాం.
Please Read Disclaimer