మహారాష్ట్ర కొత్త సీఎం ఆయనే.. ఎన్నాళ్లో!

0

మహారాష్ట్ర రాజకీయ నాటకీయ పరిణామాలు మరో మలుపు తీసుకున్నాయి. విశ్వాస పరీక్షను ఎదుర్కొని బల నిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించిన కొన్ని గంటల్లోనే బీజేపీ వాళ్లు వెనక్కు తగ్గారు. బీజేపీతో కలిసి వచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెనక్కు తగ్గి రాజీనామా చేయడంతో తాము చేయగలిగింది కూడా ఏమీ లేదన్నట్టుగా బీజేపీ వెనక్కు తగ్గింది. కోతలు కోసిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తప్పుకున్నారు.

ఇలాంటి క్రమంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ ల కూటమి హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. వారు ఒక ఒప్పందానికి వచ్చి గవర్నర్ ను కలిసే సయంలోనే బీజేపీ ట్విస్ట్ చేసింది. తెల్లవారుఝామున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అయితే దాని మనుగడ మాత్రం సాధ్యం కాలేదు.ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వమాలేక తిరిగి రాష్ట్రపతి పాలనా..అనేది చర్చనీయాంశంగా నిలుస్తోంది. అయితే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్సీపీ సేన కాంగ్రెస్ లు అంటున్నాయి. కాబట్టి వారికి గవర్నర్ అవకాశం ఇవ్వాల్సి ఉంది.

ఇప్పటికే ఆ పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చాయి. తమకు నూటా అరవై రెండు మంది ఎమ్మెల్యేల బలం ఉందని ఆ పార్టీ అంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే.

ఉద్ధవ్ ఠాక్రే ఆ కూటమి తరఫున ముఖ్యమంత్రి గా ఎన్నిక కాబోతున్నారని తెలుస్తోంది. ఇలా తొలి సారి మహారాష్ట్ర పీఠంపై ఠాక్రేలు కూర్చోబోతున్నారు. అయితే వాస్తవానికి ఆదిత్య ఠాక్రే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. కానీ మరీ ఇరవై తొమ్మిదేళ్ల యువకుడు కావడం కాంగ్రెస్-ఎన్సీపీల్లో కురువృద్ధ నేతలు ఉండటంతో ఆయనకు అవకాశం దక్కడం లేదు. ఉద్ధవ్ అభ్యర్థిత్వానికి ఆ పార్టీలు ఓకే చెప్పాయి.

ఈ నేపథ్యంలో ఉద్ధవ్ మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఐదేళ్ళూ ఆయనే సీఎంగా ఉంటారని శివసేన ప్రకటించింది!
Please Read Disclaimer