సీఈసీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్

0

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జీవోల ద్వారా తొలగించిన విషయం తెలిసిందే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేయడంతో జగన్ ఆగ్రహించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలా వాయిదా వేస్తారని.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతోనే నిమ్మగడ్డ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మగా మారాడని వైసీపీ మంత్రులు – నేతలు మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందున చంద్రబాబు హయాంలో నియామకమైన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను జగన్ సర్కార్ ప్రత్యేక ఆర్డినెన్స్ – జీవోలతో తొలగించింది. నిబంధనలు మార్చి కొత్త సీఈసీని నియమించింది. దీనిపై మాజీ సీఈసీ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఈ విషయంలో హైకోర్టు తీర్పు వెలువరించింది.

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. సీఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టివేస్తూ నిర్ణయించింది. అంతేకాదు.. ఏకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.

ఈ పరిణామం ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ గా మారింది. ఇప్పటికే నిమ్మగడ్డను తొలగించి కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ గా మాజీ జడ్జీని జగన్ సర్కార్ నియమించింది. ఆయన బాధ్యతలు కూడా చేపట్టారు. ఇప్పుడు ఈ నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడం.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో తీర్పు వెలువరించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.
Please Read Disclaimer