Templates by BIGtheme NET
Home >> Telugu News >> రిలయన్స్ పిటీషన్ పై హైకోర్టు నోటీసులు

రిలయన్స్ పిటీషన్ పై హైకోర్టు నోటీసులు


మోడీ సర్కార్ అమలు చేస్తున్న రైతు చట్టాల వెనుక కార్పొరేట్లు ఉన్నారని ఆరోపిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ముఖ్యంగా పంజాబ్ లో తమ టవర్లను కొందరు రైతులు ధ్వంసం చేయడంపై రిలయన్స్ పంజాబ్ కోర్టుకు ఎక్కింది. వీటి రక్షణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటీషన్లు దాఖలు చేసింది.

ఈ క్రమంలోనే మంగళవారం హైకోర్టు రాష్ట్రాలకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సుధీర్ మిట్టల్ ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరిస్తూ నోటీస్ ఆఫ్ మోషన్ జారీ చేశారు. దీనికి ఫిబ్రవరి 8 కల్లా సమాధానం చెప్పాలని ఆదేశించారు.

తమ రిలయన్స్ జియో టవర్లకు రైతులు నష్టం కలిగించడం వల్ల ముఖ్యంగా సంస్థ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని రిలయన్స్ తమ పిటీషన్లలో పేర్కొంది.

పంజాబ్ లో సుమారు 1500 టవర్లను ఇటీవల అన్నదాతలు నాశనం చేసి.. కేబుల్ వైర్లను కట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుశ్చర్యల వెనుక సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయని.. వారు అసలు రైతులు కారని రిలయన్స్ ఆరోపించింది. ఈ దేశానికి ఆహారం అందిస్తున్న అన్నదాతంటే తమకు ఎంతో గౌరవం ఉందని రిలయన్స్ యాజమాన్యం తెలిపింది. పైగా కార్పొరేట్ వ్యవసాయం పట్ల తమకు ఆసక్తి లేదని స్పష్టం చేసింది.