అమలాపురం శుభ కలశం కూల్చివేతకు బ్రేకులేసిన హైకోర్ట్

0

అమలాపురంలోని శుభ కలశం కూల్చివేతను ఆపేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శుభ కలశాన్ని తొలగించి.. ఆ ప్రాంతాన్ని సుందరీకరించి.. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. ఆదివారం కలశాన్ని కూల్చివేయడానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. కూల్చివేతలను టీడీపీ, జనసేన నాయకులు, ప్రజలు అడ్డుకున్నారు. ఆజాద్ ఫౌండేషన్ సభ్యులు రాత్రంతా నిద్రపోకుండా కలశాన్ని కూల్చకుండా కాపలా కాశారు.

కూల్చివేతను ఆపాలంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. శుభ కలశాన్ని కూల్చవద్దంటూ మున్సిపల్ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది.

నవంబర్ 21న కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. శుభ కలశం అమలాపురానికి శుభ సూచకమని పెద్దలు చెప్పేవారని.. అలాంటి దాన్ని ఇప్పటికిప్పుడు కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అమలాపురం వాసులు ప్రశ్నిస్తున్నారు.

అంబేద్కర్ అంటే గౌరవం ఉంది కానీ.. ఓఎన్జీసీ నిధులతో నిర్మించిన కలశాన్ని కూల్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామనడం ఎంత మేరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.
Please Read Disclaimer